సన్న వడ్లకు కష్టకాలం…

సిరా న్యూస్,మహబూబ్ నగర్;
వ్యవసాయరంగంలో అధునాతన సాంకేతిక అందుబాటులోకి వస్తున్నా వాటి పట్ల రైతుల్లో అవగాహణ కల్పించటంలోనే తగిన వేగం అందుకోలేక అధికార యంత్రాగం ఆపసోపాలు పడుతోంది. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందించటంలో వెనుకబడుతోంది. రాష్ట్రంలో తొలిసారి ధాన్యం గింజల కొలతల ప్రక్రియ రైతుల్లో భయాలను పుట్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నేలల స్వభావం ,వాతావరణం తదితర అంశాల వల్ల ధాన్యం గింజ సైజులో కొద్దిగా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని , అటువంటి రకాలను సన్నధాన్యంగా గుర్తించకపోతే నష్టపోతామన్న సందేహాలు రైతులనుంచి వ్యక్తమవుతున్నాయి.బియ్యం గింజల కొలతల ప్రక్రియ పట్ల వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ, పౌరసరఫరాల శాఖలకు చెందిన వాటిలో ఏవి ఇంతవరకూ రైతుల్లో సరైన అవగాహన కల్పించలేకపోయాయి. రాష్ట్ర వ్యవసాయరంగం చరిత్రలో ఇప్పటివరకూ ధాన్యానికి కనీస మద్దతు ధరలు ..వాటి గ్రేడ్‌లను బట్టి నిర్ణయిస్తూ వచ్చారు. ఏగ్రేడ్ ,కామన్ గ్రేడ్ రకాలుగానే ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తూ వస్తోంది. ఏ గ్రేడ్ రకానికి కామన్ గ్రేడ్ కంటే 20రూపాయల మేరకు అధికంగా ధర చెల్లించేవారు. ఇక సన్నరకం ధాన్యం అయినా , దొడ్డు రకం ధాన్యం అయితే ఇదే గ్రేడ్‌ల కిందే కొనుగోలు జరిగేవి.సన్నరకం ధాన్యం అధికంగా ప్రైవేటు వ్యాపారులే కాస్తో కూస్తో అధికంగా ధర చెల్లించి కొనుగోలు చేస్తుండటంలో ఈ రకం ధాన్యం కూడా ధాన్యం సేకరణ కేంద్రాలకు తక్కవగానే వచ్చేది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సన్నరకాల వరిసాగును ప్రొత్సహిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సన్నరకాలు పండించే రైతులకు క్వింటాలకు రూ.500 బోనస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2320, కామన్ రకాలకు రూ.2300 ధరను ప్రకటించింది.కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే ధరలతో కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బిపిటి ,ఆర్‌ఎన్‌ఆర్, 15048, హెచ్‌ఎంటిసోనా , జై శ్రీరాం తదితర 33వరిరకాలను సన్నరకం ధాన్యాలుగా గుర్తించి ఆ మేరకు ఈ రకాలకు మాత్రమే క్వింటాలకు రూ.500బోనస్ ప్రకటించింది.చిన్న చిన్న వస్తువుల కొలతలు నిర్ధారించే కాలిపర్స్ సాయంతో సన్నధాన్యం గుర్తింపు ప్రక్రియను చేపట్టనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.గ్రెయిన్ కాలిపర్స్ ద్వారా ఈ కొలతలను నిర్వహించనున్నారు. రైతులు బస్తాల్లో తెచ్చిన ధాన్యం నుంచి పరీక్ష నిమిత్తం పది గింజలను తీసుకుంటారు .ఈ గింజల పొట్టు తీసిన తర్వాత బియ్యం గింజను గ్రేయిన్ కాలిఫర్స్ సాయంతో కొలత వేస్తారు .గింజ పొడవు 6 మిల్లీమీటర్లు మించరాదు. అదే విధంగా గింజ వెడల్పు 2మి.మి మించకుండా ఉంటే వాటిని సన్నరకంగా పరిగణిస్తారు. బియ్యం గింజ పొడవు వెడల్పు నిష్పత్తి 2.5 కటే ఎక్కువ ఉంటే వాటికి ప్రాధాన్యత ఇస్తారు. బియ్యంలో తేమ కూడా 17శాతం లోపే ఉండాలి. ఈ పరీక్షలకు నిలిచిన ధాన్యం మాత్రమే సన్నరకంగా ఎంపిక చేసి వాటికి మాత్రమే క్వింటాలకు రూ.500బోనస్ కలిపి మొత్తం రూ.2820 ప్రభుత్వం ఆ రైతుకు చెందిన బ్యాంకు ఖాతాకే నిధులు జమ చేస్తుంది.తొలిసారి సన్న రకం ధాన్యం సేకరణను ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతుండటంతో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతై వాటిని వెంటనే పరిష్కరించేందకు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మండల స్థాయిలో కమిటీలను నియమించింది. తాసిల్దార్ , ఎంపిడివో, ఎస్‌ఐ, ఏఈవో, ఐకెపి ఎపిఎంవో, పిఏసిఎస్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, మెప్మా సిఈవోలను ఈ కమిటీల్లో సభ్యులుగా నియమించింది. ఈ కమిటిలకు ఇప్పటికే ప్రాధమిక స్థాయిలో అవగాహణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్ కింద అన్ని రకాల పంటలు కలిపి మొత్తం కోటి 29లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఇందులో 65.49లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతుల పంట పొలాలు పరిశీలించింది. రైతు పేరు, అధార్ నెంబర్, పొలం సర్వే నెంబర్ , సాగు చేసిన పంట, పంటలో విత్తన రకం ,విస్తీర్ణం తదితర అంశాలను ఈ క్రాప్ పోర్టల్ ద్వారా నమోదు చేశారు. రైతులు తాము పండించిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు, వ్యవసాయ మార్కెట్లకు తీసుకుని వేళితే ముందుగా వ్యవసాయాశాఖ అధికారుల ద్వారా ఈ క్రాప్ ధృవీకరణ పత్రం తీసుకోవాలి.అందులో ఆ రైతు పంటకు సబంధించిన అన్ని వివరాలు పొందు పరిచి ఉంటాయి. ప్రభుత్వం ఖరీఫ్ ధాన్యంలో 91లక్షల మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసింది. అందులో 50లక్షల టనులు సన్నరకం ధాన్యమే వస్తుందని అంచనా వేసి ఆమేరకు కొనుగోలు ప్రణాళికలను సిద్దం చేసింది. ధాన్యం నుంచి గింజలను తీసి శాంపిల్ కింద బియ్యం గింజలను కొలిచే క్రమంలో ఈ క్రాప్ ధృవీకరణ పత్రం కూడా ప్రామాణికంగా మారనుంది. రైతులు తాము పండించిన ధాన్యం శాంపిళ్ల పరీక్షలో తేడాలు వస్తే ఒకటికి నాలుగు సార్లు ధాన్యం గింజలను పరీక్షకు పెట్టి ఈ క్రాప్ పత్రాన్నికూడా ఆధారంగా చూపాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *