సిరా న్యూస్,విజయవాడ;
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఎప్పుడు అనేది చెప్పకపోయినా ఈ ప్రభుత్వం ఐదేళ్లు మాత్రం అధికారంలో ఉండదన్న స్పష్టమైన సిగ్నల్స్ ఇప్పటికే ఎన్డీఏ మిత్రపక్షాలకు చేరినట్లు తెలిసింది. దేశమంతా ఒకే సారి రాష్ట్ర, లోక్‌సభ ఎన్నికలు జరిపే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రధాని మోదీతో పాటు కీలక నేతలు భాగస్వామ్య పక్షాలతో త్వరలో మాట్లాడే అవకాశముంది. అందరినీ ఒప్పించి జమిలి ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మళ్లీ జరిగితే ఈసారి ఎవరిది అధికారం అన్నది మాత్రం అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.వరద బాధితులకు భారీ ప్యాకేజీ ప్రకటించిన చంద్రబాబు కూటమి బలంగానే.. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. వంద రోజుల పాలనలో చంద్రబాబు రేపు సమీక్ష చేయనున్నారు. మంత్రులకు కూడా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. దీంతో పాటు పాలనపరమైన ఇబ్బందులను కూడా అధిగమించి వీలయినంత త్వరగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా చంద్రబాబు తొలుత మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు యువతకు నిరుద్యోగ భృతిని కూడా అందచేయాలని చూస్తున్నారు. అదే సమయంలో రేపు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించడంతో పాటు ఎమ్మెల్యేలకు కూడా మార్గదర్శనం చేయనున్నారు. అంటే చంద్రబాబు కూడా జమిలి ఎన్నికలకు దాదాపు సిద్ధమయినట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుందని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. కాపు + కమ్మ + కమలం కాంబినేషన్ తో మరోసారి విజయం తధ్యమని నమ్ముతున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ కూడా పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే జగన్ చేసిన కొన్ని జిల్లాల పర్యటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో వైసీపీ నేతలు త్వరలోనే యాక్టివ్ అయ్యేందుకు కూడా జగన్ త్వరలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలిసింది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు జమిలి ఎన్నికల అంటే దాదాపు సాధారణ ఎన్నికలకు రెండు, మూడేళ్లు ముందే వస్తాయన్న ఊహాగానాలు చెలరేగుతుండటంతో ఇక నియోజకవర్గాల వారీగా నేతలు యాక్టివ్ అయ్యేందుకు జగన్ స్వయంగా రంగంలోకి దిగనున్నారని తెలిసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు అధ్యక్షులతో పాటు పార్టీ అధికార ప్రతినిధులను కూడా నియమించిన జగన్ మరిన్ని నియామకాలు చేపడతారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జమిలి ఎన్నికలు జరిగితే ఈసారి కూడా ప్రజాతీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. వరదల సమయంలో తాను పడిన శ్రమతో పాటు ప్రభుత్వం చూపిన చొరవతో ప్రాణనష్టం తగ్గించిన విధానం పట్ల కూడా ప్రజలు ఆకర్షితులయ్యారన్న ఫీడ్ బ్యాక్ చంద్రబాబుకు ఇప్పటికే చేరిందని తెలిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా జమిలి ఎన్నికలు తమ హయాంలోనే జరుగుతాయని స్పష్టం చేయడంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తుండటంతో రానున్న రోజుల్లో ఏపీలో మళ్లీ ఎన్నికల హీట్ మొదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ కూడా ఈసారి ప్రజలు తనను ఆదరిస్తారన్న విశ్వాసంతో ఉన్నారు.