రోజా రిటర్న్స్…

సిరా న్యూస్,తిరుపతి;
కోల్పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడిని నిజం చేస్తున్నారు మాజీ మంత్రి రోజా. తన సొంత నియోజకవర్గంలో నగరిలో అంతా సెట్‌ చేసుకోడానికి చకచకా పావులు కదుపుతున్నారు. తన ఓటమి కారణమైన సొంత పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తన కంట్లో నలుసులా వ్యవహరిస్తున్న నగరి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయించిన తన కసిని తీర్చుకున్నారు. నగరిపై మళ్లీ పట్టు పెంచుకునేలా రోజా చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. మూడేళ్లుగా నగరిలో రోజాకు ఎదురైన కష్టాలు అన్నీఇన్నీ కావు. అధికార పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ రోజాకు సంతోషం ఉండేది కాదు. మొన్నటి ఎన్నికల వరకు ఆమెకు ఇంటాబయటా సమస్యలే. ముఖ్యంగా సొంత పార్టీ నేతలే రోజాను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు.శపథం చేసి మరీ అన్నంత పని చేశారు. కూటమి సునామీలో తానూ కొట్టుకుపోయానన్న బాధ కన్నా… సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడవడం రోజాను ఎక్కువ బాధపెట్టింది. జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యులు కూడా రోజా ఓటమి వెనక ఉన్నారని అనుమానాలు ఉన్నాయి. ఓటమి తర్వాత మూడు నెలల పాటు సైలెంట్‌గా ఉన్న రోజా.. ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రోజాపై రకరకాల ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె వైసీపీని రాష్ట్ర రాజకీయాలను వదిలేసి తమిళ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తారని విస్తృత ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారాలను మౌనంగా భరించిన రోజా… వాటి వెనుక సొంత పార్టీ ప్రత్యర్థులే ఉన్నారని గ్రహించి వారికి చెక్‌ చెప్పేలా అడుగులు వేశారని అంటున్నారు.సమయం చూసి ప్రత్యర్థుల పని పట్టాలని భావించిన రోజా.. పార్టీ అధినేత జగన్‌తో జరిగిన సమావేశంలో మొత్తం తన బాధను వెల్లగక్కారని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం ఉమ్మడి జిల్లా నేతలతో మాజీ సీఎం జగన్‌ సమావేశమవ్వగా, తన ఓటమికి కారణాలను వివరించిన రోజా… మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శాంతి దంపతులపై వేటు వేయాల్సిందిగా కోరినట్లు సమాచారం. రోజా వినతి మేరకు సత్వరమే స్పందించిన జగన్‌… శాంతి, ఆమె భర్త కుమార్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ప్రకటన జారీ చేశారు.వాస్తవానికి రోజాకు… పార్టీలోని మిగిలిన క్యాడర్‌కు చాలా గ్యాప్‌ ఉండేదని చెబుతున్నారు. నగరిలో రోజాకు వ్యతిరేకంగా మూడు నాలుగు గ్రూపుల పనిచేసేవి. వీరిలో కేజే శాంతి, కుమార్‌ తప్ప మిగిలిన వారంతా ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల్లో శాంతి దంపతులు కూడా రోజాకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం ఉంది.మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులైన శాంతి దంపతులు.. రోజా నగరిని వీడితే వైసీపీ ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకోవాలని భావించారు. ఎన్నికల అనంతరం రోజాకు నగరికి సంబంధాలు లేవని ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే ఆ వీడియోపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని రోజా సైలెంట్‌గా తన పని పూర్తి చేశారు. అధినేత అండదండలతో పెద్దిరెడ్డి మనషులైనా తన నియోజకవర్గంలో తన మాటే శాసనం అన్న సంకేతాలు పంపగలిగారంటున్నారు.వైసీపీ అధికారంలో ఉండగా, కేజే శాంతి ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా నామినేటెడ్‌ పదవిని పొందారు. అంతకు ముందు మునిసిపల్ చైర్‌పర్సన్ గానూ పనిచేశారు. నగరిలో తొలి నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నది శాంతి దంపతులే. నగరి వైసీపీ ఇన్ ఛార్జ్ గా రోజా బాధ్యతలు స్వీకరించాక ఆమెకు తొలుత ఆశ్రయం ఇచ్చింది కూడా వారే. 2014, 2019 ఎన్నికల్లో రోజా గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. రెండోసారి రోజా ఎమ్మెల్యే అయ్యాక కేజే దంపతులతో విభేదాలు మొదలయ్యాయి.తెలుగుదేశం పార్టీ నేతలను చేరదీసి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని రోజాపై కేజే దంపతులు వ్యతిరేకత పెంచుకున్నారు. వారి అసంతృప్తిని రోజా కూడా లైట్‌గా తీసుకోవడంతో క్రమంగా గ్యాప్‌ పెరిగిపోయింది. చివరికి ఒకనాటి మిత్రులు బద్ధశత్రువులుగా మారిపోయారు. వీరి పంచాయతీపై అధినేత వైఎస్ జగన్ ఫోకస్‌ చేసిన, అసమ్మతి చల్లారలేదు. శాంతి, రోజా చేతులు కలిపేలా బహిరంగ వేదికపై జగన్‌ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక అప్పటి నుంచి విభేదాలు మరింత ఎక్కువ కావడం.. అవి రోజా ఓటమికి దారితీయడంతో ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు రోజా..మొత్తానికి పార్టీ నుంచి ప్రత్యర్థులను పంపడం ద్వారా నగరిలో రోజా మాటకే వైసీపీ అధిక ప్రాధాన్యమిచ్చినట్లైంది. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా చెప్పే పెద్దిరెడ్డి సైతం రోజా ఫిర్యాదుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదంటున్నారు. దీంతో అధినేత జగన్‌ వెంటనే చర్యలకు దిగారు. ఇక రోజాకు పార్టీ పరమైన తలనొప్పులు తప్పించడంతోపాటు అదనంగా పార్టీ అధికార ప్రతినిధిగా నియమించి ప్రోత్సహించారు. ఈ పరిణామాలతో వంద రోజులుగా తనపై వస్తున్న అన్నీ ఊహాగానాలకు చెక్‌ చెప్పిన రోజా… నగరి వైసీపీలో తనదే హవా అని చాటిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *