– 56 అంశాలు..75 ప్రశ్నలు
– సర్వేలో ఎన్నో వివరాలు..
సిరా న్యూస్,పెద్దపల్లి;
సమగ్ర కుటుంబ సర్వేకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ప్రారంభమయిన సర్వేలో ప్రతి కుటుంబం వివరాలను సేకరించనున్నారు. సర్వే కోసం 1,979 మంది ఎన్యుమరేటర్లు, 180 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150 నుంచి 175 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్లు సైతం దాదాపు 10 శాతం కుటుంబాలను ర్యాండమ్‌గా తనఖీ చేసి.. సర్వే సవ్యంగా జరిగిందీ లేనిదీ పరిశీలిస్తారు. తమ పరిధిలోని ఎన్యుమరేట ర్లకు అవసరమైన సూచనలి వ్వడంతో పాటు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరిస్తారు.
56 అంశాలు..75 ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో 56 అంశాలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమాచారం సేకరించనున్నారు. సర్వే నిమిత్తం ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో విద్యార్థులకు ఉదయం పూట మాత్రమే తరగతులు కొనసాగనున్నాయి. మధ్యాహ్నభోజనం అనంతరం టీచర్లు సర్వేలో పాల్గొంటారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు యథావిధిగా నడుస్తాయి. జిల్లాలో 580 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 1,117 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులతో పాటు, హెచ్‌ఎంలు, సీఆర్సీలు, సమగ్రశిక్ష సిబ్బంది, ఇతర ఉద్యోగులు 355 మంది పనిచేస్తున్నారు. వీరిని గణకులుగా నియమించి సర్వేలో పాల్గొనాలని డీఈఓ పేర్కొన్నారు.
గతంలో మాదిరిగా..
సర్వేలో భాగంగా జిల్లావ్యాప్తం గా దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రజల వివరాలను సేకరించనున్నారు. 2014లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 2,20,673 నివాసాలు, 9,21,623 జనాభా ఉన్నట్లు లెక్క తేలింది. ప్రస్తుతం దాదాపు 2.5 లక్షల నివాసాలకు చేరి ఉంటాయని అంచనా. అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. అవసరం మేరకు అదనపు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల సేవలను వినియోగించుకుంటారు.
రంగంలోకి 1,979 మంది ఎన్యుమరేటర్లు
సర్వేలో ఎన్నో వివరాలు..
సర్వేలో భాగంగా కుటుంబ యజమానితో పటు సభ్యులందరి వివరాలు.. యజమానితో వారికున్న సంబంధం.. సభ్యులందరి విద్యార్హతలు, ఉద్యోగం లేదా ఉపాధి వివరాలు, మాతృభాష, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏమైనా సంక్షేమ ఫలాల పొందారా.. అద్దె ఇల్లా..సొంతిల్లా.. ఉంటున్న ఇంటికి ఉచిత విద్యుత్ సదుపాయం పొందుతున్నారా? వంటి వివరాలు సైతం సేకరించనున్నారు. ఇక స్థిరాస్థిలో భాగంగా భూములు, ఇల్లు వంటి వివరాలతో పాటు చరాస్థి వివరాల్లో భాగంగా ద్విచక్ర వాహనాలతో పాటు కంప్యూటర్లు వాడుతుంటే ఆ వివరాలను సైతం సేకరిస్తారు.