సిరా న్యూస్,కడప;
సజ్జలకు పోలీసులు నోటీసులివ్వడంతో జగన్ అలర్ట్ అయ్యారా? కీలక నేతలకు ఇబ్బందులు తప్పవని ముందుగానే అధినేత ఊహించారా? సీనియర్లను పక్కనపెట్టి కొత్తవారికి ఛాన్స్ ఇస్తున్నారా? రాబోయే ఐదేళ్లు పార్టీ నడిపేందుకు ఈ విధంగా స్కెచ్ వేశారా? అందుకోసమే అనుబంధ సంఘాలతో భేటీ అవుతున్నారా? అవుననే సమాధానం వస్తోంది.వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాటల్లో మార్పు వచ్చినట్టు పైకి కనిపిస్తోంది. కొద్దిరోజులపాటు నేతలకు, కేడర్‌కు దూరంగావున్న ఆయన, క్రమంగా యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో విధంగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ చిన్న విషయాన్ని అద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు కూడా. నెగిటివ్‌ని అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారాయన.గడిచిన వంద రోజులు ప్రశాంతంగా ఉన్న మాజీ సీఎం, టెన్షన్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు చంద్రబాబు సర్కార్ కేసులను సీఐడీకి ఇవ్వడం, మరోవైపు నేతలకు నోటీసులు తదితర పరిణామాలతో మాజీ సీఎం కలవరం పడుతున్నట్లు కనిపిస్తోంది. లేటెస్ట్గా గురువారం జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో భేటీ అయ్యారు జగన్.వైసీపీ నేతలకు జగన్ పలు అంశాలపై కీలక దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఎలా ఉండాలనేది వివరించారు. పని తీరుపై పరిశీలన, మానిటరింగ్ ఉంటుందని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా సోషల్ మీడియాలో నేతలంతా యాక్టివ్‌గా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం.జిల్లా అధ్యక్షుల పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఉంటాయని చెప్పకనే చెప్పారు జగన్. బాగా పని చేసేవారికీ రేటింగ్స్ ఇస్తామని, రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందన్నది అధినేత మాట. ఈ సమావేశానికి సీనియర్ నేతలు సైతం హాజరయ్యారు.జగన్ వ్యవహారశైలిని కొందరు నేతలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. నాయకుడు అనేవాడు ప్రజల్లో నుంచి రావాలని గతంలో జగన్ పదే పదే చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ సమావేశానికి ముందు జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు టీడీపీకి చెందిన ఓ నేత. తూర్పు గోదావరి ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు వైసీపీ కండువా కప్పుకున్నారు.