సిరా న్యూస్,విశాఖపట్టణం;
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి ప్రకోపం బీభత్సం సృష్టించిన తీరు ఇంకా కళ్లముందు కనిపిస్తుంది. వయనాడ్‌లో ఏర్పడిన ప్రళయం తరహాలోనే విశాఖలో కొన్ని నివాసాలు కొండలు, డ్రెయినేజీలు, చెరువులను ఆక్రమించి నిర్మించుకున్నారు. దీంతో పాటు సింహాచలంలో కూడా చాలా వరకు నిర్మించుకున్న ఇళ్లు ఆక్రమణలేనని తెలుస్తోంది.ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నివాసాలకు వయనాడు తరహా పరిస్థితి ఏర్పడే ప్రమాదముంది. ముందస్తు చర్యలు తీసుకోకుంటే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పలు చోట్ల కొండచరియలు విరుగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలామంది నివాసాలు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాల్చుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్లీ ఏపీలో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు విశాఖ నగరంలోని గోపాలపట్నంలో కొండచరియాలు విరగిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో కొన్ని ఇళ్లు ఉండడంతో గోపాలపట్నంను ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. ఈ మేరకు పలు ఇళ్లకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండవాలు ప్రాంతాల్లో ఉన్న భవనాల కింద మట్టి తొలగిపోవడంతో మిగతా ఇళ్లకు సైతం ప్రమాదం పొంచి ఉందని జీవీఎంసీ అధికారులు హెచ్చరించారు.కొండవాలు ప్రాంతాల్లో 135 కాలనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 14,431 కుటుంబాలు నివాసం ఉంటుండగా..73 కాలనీలకు రక్షణ గోడలు లేవని అధికారులు చెప్పారు. కొండవాలు కాలనీల్లో అనకాపల్లి జోన్‌లోని ఇందిరమ్మ కాలనీ, బీసీ కాలనీ 1, బీసీ కాలనీ 2, పాస్టర్ కాలనీతో పాటు జోన్ 2 పరిధిలోని హనుమంతవాక కాలనీలు తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం ఈ కాలనీల్లో 249 కుటుంబాలు నివసిస్తున్నాయని తేలింది. ఇప్పటికే అధికారులు పలుకాలనీల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ మేరకు రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తరుణంలో కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాని అధికారులు చెబుతున్నారు. గోపాలపట్నంలో చాలా ఇళ్లు కొండవాలు ప్రాంతంలోనే ఉంటాయి. కొండ దిగువన కూడా ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు.రానున్న 24 గంటల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ 0891-2590102, 0891-2590100, విశాఖ పోలీసు కంట్రోల్ రూం నంబర్ 0891-2565454, డయల్ 100, డయల్ 112 నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, ఈ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. పాత ఇళ్లల్లో నివాసం ఉండేవారు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.