సిరా న్యూస్,హైదరాబాద్;
గ్రూప్ 1 మెయిన్స్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి సీఎస్ శాంతికుమారి ప్రకటన విడుదల చేశారు. ఈనెల 21వ తేదీ నుండి 27 వ తేదీ వరకు జరిగే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత ఉన్నతాధికారులతో సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుండి చైర్మన్ మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొనగా, సచివాలయం నుండి డీజీపీ జితేందర్, కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.పరీక్షలు నిర్వహించే అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు, విస్తృత స్థాయిలో సీనియర్ అధికారులతో పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీఎస్. జిల్లా కలెక్టర్లు నేరుగా ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారని, సంబంధిత పోలీస్ కమిషనర్లు కూడా బందోబస్తు ఏర్పాట్లను చేపడుతారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఏవిధమైన స్వల్ప సంఘటనలు జరుగకుండా అత్యంత అప్రమత్తంగా ఈ పరీక్షల నిర్వహణ విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.టీజీపీఎస్‌సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, 2011 తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయని, ప్రతీ అంశంలోనూ అత్యంత జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ కూడా సవాలుతో కూడుకుంటున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, వదంతులకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఇటు, గ్రూప్ 1 జరిగే అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తుతోపాటు అంతా ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని చర్యలు చేపట్టామని డీజీపీ జితేందర్ తెలిపారు.ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. టీజీపీఎస్‌సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని పర్యవేక్షిస్తారు. పరీక్షల నిర్వహణలో ప్రతి స్టెప్‌లోనూ కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు అధికారులు.
బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బంది నియామకం
మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించరు
దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట సమయం అదనంగా కేటాయింపు
ఎవరికైతే పరీక్ష రాయడానికి సహాయకులు (స్క్రైబ్) అవసరమో, ఆ అభ్యర్థుల హాల్ టికెట్లపై ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది
స్క్రైబ్‌ల సహాయంతో పరీక్షలు రాసే వారికి ప్రత్యేకంగా 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తారు
అన్నిపరీక్షా కేంద్రాల 46 ప్రత్యేక వైద్య శిబిరాలు
నిరంతరం విద్యుత్ సరఫరా అందించేవిలా చర్యలు
అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు