సిరా న్యూస్;
-నేడు ప్రపంచ పేపర్ బోయ్స్ దినోత్సవం
నగరం నిద్రపోతున్న వేళ… తొలి కోడి కూతకు ముందే అతడు మేల్కొంటాడు.రవి కిరణాలు ప్రసరించక మునుపే.. ఎముకలు కొరికే చలిలోనూ ప్రపంచాన్ని గుప్పిట పట్టి ఆ సంగతులన్నింటినీ ఇంటింటికీ చేరవేస్తాడు. తానెవరో కూడా కన్పించక… ఇలా వచ్చి, అలా వెళ్లిపోతాడు. పేరుకు మాత్రమే అతడు పేపర్ బాయ్…కానీ, అతడో సామాజిక సారథి.. వార్తా పత్రికలను పాఠకులకు చేర్చే నిత్య నూతన వారధి. అతనికి కూడా ఒక రోజు వుందోచ్.. ఈరోజు ప్రపంచ పేపర్ బోయ్స్ దినోత్సవం. తొలి పేపర్ బాయ్‌గా గుర్తింపు పొందిన బార్నీ ప్లాహెర్డీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబరు 4న అంతర్జాతీయ పేపర్‌బాయ్ దినోత్సవం జరుపుతున్నారు. మొట్టమొదటి పేపర్ బాయ్ అమెరికాకు చెందిన బార్నీ ఫ్లాహెర్టీ. ఆ రోజుల్లో పేపర్ వెయ్యాలంటే అక్కడి ప్రజలు నామోషీగా భావించేవారు. బార్నీ మాత్రం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నట్టు తన పరిస్థితికి తగ్గట్టు తాను పేపర్ బాయ్‌గా చేస్తే తనకు ఖర్చులకు డబ్బులు వస్తాయని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పేపర్ బాయ్ గా చేరిపోయాడు. 1833 నాటికి అతడి వయస్సు 10 సంవత్సరాలు. ఆయన అప్పట్లో న్యూయార్క్ సన్ పేపర్ వేసేవాడు. తెల్లవారకముందే దిన పత్రిక ఇంటికి చేరవేస్తుండడంతో ఇతర పేపర్ల వినియోగదారులు సైతం బార్నీ వేసే న్యూయార్క్ సన్ పేపర్‌నే కోరుకున్నారు. దీంతో అనతికాలంలోనే ఆ పత్రిక చందాదారులు రెట్టింపయ్యారు. బార్నీ అనంతరం మరికొందరు పేపర్ బాయ్‌గా చేరినా వారందరికీ అతడే ఆదర్శంగా నిలిచారు. బార్నీ సేవలు గుర్తించిన పత్రికా యాజమాన్యం అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించింది. పేపర్ బాయ్‌గా చాలా మంది పాఠకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బార్నీ పుట్టినరోజు (సెప్టెంబర్ 4)ను ఆయా పత్రికా సంఘాల నాయకులు పేపర్ బాయ్స్ డే గా ప్రకటించారు. నాటి నుంచి ప్రపంచంలోని అన్ని పత్రికల యాజమాన్యాలు బార్నీ పుట్టిన రోజున పేపర్ బాయ్స్‌డేగా ఫాలో అవుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాలోని హ్యూస్టన్‌లో టెక్సాస్ ప్రెస్ అసోస్సియేషన్ 125 వార్సికోత్సవం సందర్భంగా బార్నీ గౌరవార్థం అతడి కాంస్య విగ్రహాన్ని 2005లో ఏర్పాటు చేసింది. కత్తిమీద సాములాంటిదే పేపర్‌బాయ్ పని అంటే.. ఏదో పేపర్లు తీసుకొని ఉదయం ఇళ్ల వద్ద వేసి వెళ్లిపోతారని అనుకుంటారు అంతా. అయితే ఇందులో ఉన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎందరో పాత్రికేయులు రేయింబవళ్లు శ్రమించి సేకరించిన వార్తలను సబ్‌ఎడిటర్లు సరిచేసి ముద్రణ ఆమోదయోగ్యంగా మలుస్తారు. ఆ తర్వాత ముద్రించబడ్డ దిన పత్రికలను పాఠకులకు చేరవేయాల్సిన బాధ్యత పేపర్‌బాయ్‌లదే. తెల్లవారు జామున 3.30 గంటలకు ముందే పేపర్‌బాయ్‌లు నిద్రలేచి సైకిల్‌పై బయలుదేరి పేపర్ కట్టలు వచ్చే పాయింట్లకు చేరుకుంటారు. దినపత్రికలను సర్దుకున్నాక పై అంతస్థులో ఉన్న ఇళ్లకు పేపర్‌ను ఎగర వేసేందుకు తాడుతోనూ, పేపర్‌నే పొట్లంగా మలిచి ఆ కట్టలను సైకిల్‌పై సర్దుకుని బయలు దేరుతారు. తమ ఖాతాదారులకు పత్రికలు వేసుకుంటూ ముందుకు సాగిపోతారు. పేపర్ వేసే క్రమంలో సైకిల్ లేదా ద్విచక్ర వాహనం మరమత్తులకు గురవడం, ఆరోగ్యం బాగలేక నిద్రలేవడం ఆలస్యమైతే ఇక తిట్ల దండకాలే. బిల్లులు సకాలంలో వసూలు చేయకపోతే ఏజెంట్లు జీతాలు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేయడం ఇలా చాలా బాధలే ఉన్నాయి…. ఎందరో మహనీయులు: భారత రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యార్థి దశలో పేపర్‌బాయ్‌గా పని చేశారు. తన విద్యార్థి దశలో పుస్తకాల ఖర్చుల కోసం తెల్లవారుజామునే లేచి ఇంటింటా పేపరు వేసేవారు. ఇక ప్రఖ్యాత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ కూడా పేపర్‌బాయ్‌గా పని చేశారు. స్వాతంత్రోద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న రోజుల్లో బాలగంగాధర్ తిలక్ సైతం పీపుల్స్‌వార్ పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌బాయ్‌గా పనిచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహనీయులు, మహాను బావులు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే.