మూసి బచావో అంటున్న నల్గోండ వాసులు
సిరా న్యూస్,హైదరాబాద్;
అనంతగిరి కొండలు అరుదైన వనమూలికల సంపదతో తలతూగుతున్నాయి. అక్కడి గాలి పీల్చితే చాలు రోగాలన్నీ మాయమవుతాయని ఎంతోమంది నమ్మకం. ఆ వనమూలికల కొండల్లోనే మూసీ నదిపుట్టింది. అక్కడినుంచి దాదాపు 240 కిలోమీటర్లు ప్రయాణించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఆ నీరు తాగేందుకు ఎంతో విశిష్టమైనదిగా భావించేవారు. కానీ, నేడు మూసీ నది అంటేనే మురికి నీరుగా మారిపోయింది. ఇక ఈ నీరు తాగేందుకు కాదు కదా కనీసం పంటపొలాలకు కూడా వాడటం ప్రమాదకరంగా మారుతున్నది. నల్లగొండ మీదుగా ప్రవహించే మూసీ నదిలోకి నీళ్లు వచ్చాయంటే.. ఆ పరివాహక ప్రాంత రైతులకు ఆందోళన మొదలవుతుంది. ఆ నది ఎన్ని రసాయన వ్యర్థాలను తీసుకువచ్చిందో.. ఆ నీటితో తమ పంటలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనని భయపడుతారు. దాదాపు 40 ఏళ్ల ముందువరకు మూసీ నది నీటిని తాగునీటికి వాడుకున్న నల్లగొండ జిల్లావాసులు ఇప్పుడు విషంలా మారిన నదిని చూసి బాధపడుతున్నారు. ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన నడుం బిగించడంపై పరివాహక రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూసీ బచావ్ అంటూ ఎలుగెత్తి నినదిస్తున్నారుఒకనాడు మూసీ నదిని అదృష్టంగా భావించిన ప్రజలే.. ఇప్పుడు ఆ నది పేరెత్తితే భయపడుతున్నారు. 1980 ప్రాంతంలో హైదరాబాదు నగరం శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన వ్యర్థపదార్థాలను మూసీ నదికి జత చేసి చిన్నచిన్న నాలాల్లో వదలడంతో నీటి కాలుష్యం మొదలైంది. గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలోని మురికి నీటిని మూసీ నదిలోకి వదలడంతో ఆ నది మురికి కూపంగా మారింది. ప్రతిరోజు జంట నగరాల నుంచి కొన్నేళ్ల క్రితం వరకు దాదాపు 350 మిలియన్ లీటర్ల మురికి నీరు కలిసేది. కానీ ఇప్పుడు క్రమంగా 1,625 మిలియన్ మీటర్లకు చేరుకుందని తెలుస్తున్నది. మూసీ నది పరివాహ ప్రాంతం వెంట సుమారు 12 వేలకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. కేవలం జీడిమెట్ల ప్రాంతం నుంచే వెయ్యి మిలియన్ లీటర్ల మురికి నీరు మూసీలోకి వస్తున్నదని సమాచారం. అనేక ఫార్మా కంపెనీల నుంచి వస్తున్న విషపు నీరు.. మందుల తయారీ నుంచి వచ్చిన సూపర్ బగ్స్ ఎక్కువ నీటిని కాలుష్యం చేస్తున్నాయి. నాచారం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద చెరువు పటేల్ చెరువులో శుభ్రపరచిన నీటిని పరిశ్రమల్లో యంత్రాలను చల్లబరిచేందుకు.. కడిగేందుకు వినియోగిస్తున్నారు. దీనికితోడు ఇంటి వ్యర్థాలు రసాయనాలతో కూడిన డిటర్జెంట్ మురికి నీరు కూడా మూసీలో కలుస్తున్నది.ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంపై 14 దేశాలలోని 240 నదులపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోని నదుల్లో అత్యంత కాలుష్యాన్ని వెదజల్లే నదుల్లో మూసీ 22వ స్థానంలో ఉంది. ఈ నది నీళ్లలో కెమికల్స్ విపరీతంగా పేరుకుపోయాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ నీటిలో 48 రకాల క్రియాశీలక ఔషధ పదార్థాల ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించారు. యాంటీబయాటిక్స్(బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నివారణకు వాడే మందులు) యాంటీ డిఫ్ట్రెసెంట్లుకూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయని వెల్లడించారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం భూగర్భ జలాలు మెడిసిన్‌తో సమానమని., అంతే దాని అర్థం రోగం లేకపోయినా మందులు వేసుకున్నట్లేనని చెప్పారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మందులు వేసుకున్నా.. అవి పని చేయవని కొత్త రోగాలు రావడం ఖాయమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.మూసీ నది మొత్తం ఫార్మా డంపింగ్‌గా మారిపోయింది. ఈ పరివాహక ప్రాంతంలో సుమారు 70 కిలోమీటర్ల దాకా నీరు కాలుష్యమైంది. భూగర్భంలో 40 కిలోమీటర్ల లోతు వరకు కాలుష్యం చేరిపోయింది. నీటిలో 0.3 మిల్లీ గ్రాముల ఉండవలసిన బయో కెమికల్ ఆక్సిడెంట్లు 172 ఎంజీల నుంచి 1085 ఎంజీల వరకు చేరాయంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం దెబ్బతిని అనేక రకాలైన క్యాన్సర్లు కిడ్నీ వ్యాధులు, చర్మవ్యాధులు, గర్భస్రావాలు, గొంతు, కడుపు నొప్పి ఆర్థటైటిస్ లాంటి వింత వ్యాధులతో లెక్కలేనంత నష్టం జరుగుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు తెలిపారు.మూసీ నీటి ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా ఎకరాల పంటలు సాగవుతున్నాయి. మూసీ నది నీటిని వాడడం వల్ల ప్రజా ఆరోగ్యానికి కాకుండా జంతువులకు సైతం తీవ్రమైన హానికరమని తెలిసినప్పటికీ ఇప్పటికీ మూసీ నది నీరే సాగునీటి పంటలకు ఆధారంగా ఉంది. ఆ పంటలకు వేరే సాగునీరు వాడుదామన్న అవకాశాలు లేకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీబీనగర్, పోచంపల్లి, చౌటుప్పల్, భువనగిరి, వలిగొండ, మోత్కూర్, ఆత్మకూర్, రామన్నపేట లాంటి మండలాల్లో చాలామంది రైతులు మూసీ నీటిపైనే ఆధారపడి సాగు చేస్తున్నారు. మూసీకి అనుబంధ కాలువలుగా ఉన్న పిల్లయాపల్లి, ధర్మారెడ్డి పల్లి, బునాదిగాని కాలువ, భీమలింగం కాల్వ, ఆసిఫ్ నగర్ ద్వారా మూసీ నది నీరు సాగునీటికి అందుతుంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 70వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలో 1.15ఎకరాలు , సూర్యాపేట జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల వరకు సాగుతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు ప్రతిరోజు కాలుష్యంతో పోరాడుతూనే ఉన్నారు. తమకు తెలియకుండానే రోగాల బారిన పడుతూ తమ సంపాదనలో 50 శాతానికి పైగా వైద్యానికే ఖర్చు చేయాల్సి వస్తున్నది.
పరిశ్రమల వ్యర్థ పదార్థాలతో కలుషితమైన మూసీ నీటిని వ్యవసాయ పంటలకు వాడుతున్నారు. ఆ నీరు భూమిలో ఇంకిపోవడంతోపాటు పంటకు కూడా అందివ్వడం వల్ల కెమికల్ అంత పరోక్షంగా ధాన్యంలోకి చేరుతుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ప్రజలు అనేక రకాల రోగాలబారిన పడాల్సి వస్తుంది. మూసీ నది నీటితో పండిన పంటలు తినడం మనిషికి అత్యంత ప్రమాదకరం. అందుకే మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు ఎక్కువ రోగాలబారిన పడుతుంటారు