రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్యాత్మిక పర్యాటక యాత్రలకు శ్రీకారం

సిరా న్యూస్,రాజమహేంద్రవరం;

రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ సమీపంలోని టూరిజం క్యాంప్ ఆఫీస్ వద్ద టూరిజం బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి ఆధ్యాత్మిక బస్సు యాత్రను ప్రారంభించారు.రాష్ట్ర పర్యాటకాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఒకరోజు ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం లోని సరస్వతి ఘాటు వద్ద ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం దగ్గర ఆధ్యాత్మిక పర్యటన ప్యాకేజీ బస్సును మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి ప్రారంభించారు.ఆధ్యాత్మిక భావంతో యాత్రికులు ఇంటికి తిరిగి వెళ్లేలా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మార్చి నాటికి ప్రస్తుత టూరిజం పాలసీ ముగుస్తుందని ఏప్రిల్ 2025 నుంచి కొత్త టూరిజం పాలసీ అమల్లోకి తీసుకొస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పటికే కొత్త టూరిజం పాలసీకి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించామని పేర్కొన్నారు. టూరిజం శాఖలో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ అంశాన్ని పరిశీలిస్తున్నామని త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టూరిజం బోర్డ్, అధికారులు, అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి చేస్తామని మంత్రి కండల దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో రాజానగరం, రాజమండ్రి, అనపర్తి ఎమ్మెల్యేల సూచనల మేరకు వారాంతంలో ఉమ్మడి తూర్పుగోదావరిలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలు, పంచారామ క్షేత్రాలను కలిపేలా ఒక రోజు టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఈ యాత్రకు వెళ్లే పర్యాటకులకు రాజమండ్రి లోని సరస్వతి ఘాట్ వద్ద ఉన్న ఐ ఆర్ ఓ కార్యాలయం దగ్గర ప్రతి శనివారం బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పర్యాటకానికి ముఖద్వారమైన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తొలుత అత్యంత ప్రసిద్ధి చెందిన కోరుకొండ స్వయం భూ శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి దేవస్థానం, రత్నగిరి కొండపై వెలసిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనం, ఆ తర్వాత పితృముక్తి క్షేత్రంగా, పాదగయ తీర్థంగా పేరొందిన పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం దర్శించిన పిమ్మట విశాలమైన ప్రాకారాలతో, చాళక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు దర్శించుకొంటారని తెలిపారు. సామర్లకోట దేవాలయంలో మధ్యాహ్నం అన్న ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయాన్ని యాత్రికులు సందర్శిస్తారని తెలిపారు. ఆ తర్వాత అనపర్తి లోని లక్ష్మీ గణపతి దేవాలయాన్ని, కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని యాత్రికులు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీని నేటి నుండి అమలు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *