ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేవీవీపై విచారణ

సిరా న్యూస్,విజయవాడ;
ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో ఒక్కో ఆఫీసర్. రాసిందే లెక్క. చెప్పిందే వేదం. ఇష్టం వచ్చిన నిర్ణయాలు. అడ్డగోలు వ్యవహార శైలి. ఇలా గత ప్రభుత్వ హయాంలో తోచినట్లు నడుచుకున్న అధికారుల వెంటపడుతోంది కూటమి సర్కార్. అందరి లెక్కలు తీస్తోంది. ఇప్పుడు మరో అధికారి వంతు వచ్చింది. ఏపీ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణపై విచారణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హయాంలో ఆయన వైసీపీ నేతలకు నిధులు దోచిపెట్టారని, ప్రభుత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంపై బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ DOPTకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ శాఖ స్పందించి.. పరిశీలించాలంటూ రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం GADని ఆదేశించింది. దాంతో జీఏడీలో ఫైలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో 2019-24 మధ్య బిల్లుల చెల్లింపు పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు, జగన్‌ చెప్పిన వారికి..కేవీవీ సత్యనారాయణ నిబంధనలకు విరుద్ధంగా పంచేశారని సీఎం రమేశ్‌ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఫస్ట్ రికార్డ్ అయిన బిల్లులకు మొదటే చెల్లింపులు జరపాలన్న నిబంధనలను ఉల్లంఘించారన్న దానిపై హైకోర్టులో 4 లక్షల పిటిషన్లు దాఖలైనట్లు ఫిర్యాదులో మెన్షన్ చేశారుఆర్‌బీఐ ద్వారా రాష్ట్రప్రభుత్వం బాండ్లు వేలం వేసి తెచ్చిన రూ.వేల కోట్ల అప్పును వైసీపీ నేతల బినామీ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సత్యనారాయణ వాటిని దారి మళ్లించారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు కూడా..కోర్టుల్లో అమరావతి, జగన్‌ కేసుల్లో ఆయన తరఫున వాదించిన లాయర్లకు సత్యనారాయణ బిల్లులు చెల్లించారని..ఈ ఉల్లంఘనలన్నింటికీ సత్యనారాయణే కారణమని సీఎం రమేష్‌ తన ఫిర్యాదులో మెన్షన్ చేశారు.DOPTకి ఎంపీ సీఎం రమేశ్‌ ఫిర్యాదు..GAD రిపోర్ట్‌ సిద్ధం చేయడం ఇలా అంతా జరిగిపోతుండగానే..తన దారి తాను చూసుకుంటున్నారు సత్యనారాయణ. టెక్నిక్వాలిటీస్‌ను సాకుగా చూపుతో జంప్‌ అయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారు. తన డిప్యుటేషన్‌ గడువు ముగిసిపోవడంతో..తిరిగి మాతృశాఖలో చేరేందుకు తక్షణమే తనను రిలీవ్‌ చేయాలని కోరుతూ కేవీవీ సత్యనారాయణ సీఎస్‌కు లేఖ రాశారు.రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చి జూన్‌ 18నాటికే ఐదేళ్లు పూర్తయిందంటున్నారు సత్యనారాయణ. కానీ తమ అనుమతి లేకుండా సత్యనారాయణను రిలీవ్‌ చేయొద్దని జీఏడీ గతంలో ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఇంకా ఇక్కడే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఓఎస్డీగా ఉన్నారు. అయితే అప్పటి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేశానని చెబుతున్నారు సత్యనారాయణ.
ఏపీ ఆర్థిక పరిస్థితులు అల్లకల్లోలంగా మారడంలో సత్యనారాయణదే కీలక పాత్ర అనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అప్పటి ఆర్థిక సలహాదారులు ఏం చెప్పినా అన్నీ చక్కబెట్టేశారని అంటున్నారు. అలాంటి అధికారిపై యాక్షన్‌ తీసుకోవాల్సిందేనంటూ డీవోపీటీ వరకు వెళ్లింది వ్యవహారం. ఇప్పుడు జీఏడీ కోర్టులో బాల్‌ ఉంది.అయితే తన డిప్యుటేషన్‌ పూర్తిచేసుకుని కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సదరు అధికారి రెడీ అయ్యారు. సాదరంగా వీడ్కోలు పలికేందుకు అధికార యంత్రాంగం కూడా సన్నాహాలు చేస్తోంది. దీనివెనక ఉన్నతస్థాయి అండదండలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ ఆర్థిక దివాలాకు కారణమైన ఆఫీసర్‌కు ఎలా సాదర వీడ్కోలు పలుకుతారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *