సిరా న్యూస్,ఒంగోలు;
పవన్ కల్యాణ్ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నట్లే కనిపిస్తుంది. టీడీపీ కంటే ఆయన తన ప్రధాన శత్రువుగా వైసీపీని చూస్తున్నారు. వైసీీపీని పవన్ కల్యాణ్ తక్కువగా అంచనా వేయడం లేదు. ఇప్పటికీ జగన్ కు జనంలో ఇమేజ్ ఉంది. అది ఎప్పుడైనా తమకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని ఆయన అంచనాలు వేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా జగన్ విషయంలో ఏదో రకమైన బయటకు కామెంట్స్ చేస్తున్నప్పటికీ వైసీపీ పుంజుకుంటుందేమోనన్న భయం మాత్రం మనసులోనే ఉంది. వైసీపీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటే కూటమి ఏర్పడినా ఏమీ చేయలేని పరిస్థితులు తలెత్తుతాయని తెలుసు. జనం జగన్ ను మరోసారి కోరుకుంటే తమకు పార్టీ పరంగా మరింత తీవ్ర నష్టం జరుగుతుందని భయపడిపోతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు జగన్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కొత్త ఎత్తులతో రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నారు. అయితే జగన్ నేరుగా టీడీపీ ఎదుర్కొంటే ఫ్యాన్ పార్టీ అధినేతకు మరింత సానుభూతి పెరుగుతుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే అటు నుంచి నరుక్కు రావాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అందుకే వైసీపీని మరింత దిగజార్చేలా చర్యలు పవన్ తీసుకుంటే బాగుంటుందని సూచించినట్లు తెలిసింది. అందులో భాగంగానే జగన్ కు బంధువు, వైసీపీ కీలక నేత అయిన ఒంగోలు మాజీ శాసనభ్యుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని జనసేనలో చేర్చుకున్నారు. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు. ఈ పదేళ్లలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లను తక్కువ మందిని మాత్రమే చేర్చుకున్నారు. ఇప్పుడే వైసీపీ నేతలను చేర్చుకోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీని మరింత బలహీనం చేయడానికే. అది రాజకీయ పార్టీగా ఎవరికైనా అవసరం. కాదనలేం. కాకుంటే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చేర్చుకునేందుకు పవన్ మనస్తత్వానికి ఇష్టపడరు. జగన్ ను మానసికంగా వీక్ చేయాలంటే బాలినేనికి కండువా కప్పడం తప్పని సరి. అంతే కాదు ఒక ప్రధానమైన సామాజికవర్గం జగన్ ను వ్యతిరేకిస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా బలంగా సంకేతాలను పంపించగలమని పవన్ కల్యాణ్ భావించారు.పవన్ కల్యాణ్ బాలినేని శ్రీనివాసులు రెడ్డిని చేర్చుకోవడం వెనక ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కూడా ఉన్నారని చెబుతారు. ఆయన పారిశ్రామిక వేత్త. ఇద్దరికీ అనుకూలమైన మిత్రుడు. జగన్ కు శత్రువు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. లింగమనేని ప్లాన్ లో భాగంగానే బాలినేని శ్రీనివాసులురెడ్డిని పార్టీలో చేర్చుకుని రెడ్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నం పవన్ కల్యాణ్ చేసినట్లు కనపడుతుంది. త్వరలోనే బాలినేనికి పార్టీలో అత్యున్నత పదవి లభిస్తుందని తెలిసింది. ఈ పదవి ద్వారా ఆయనను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేలా చేసి జగన్ ను మరింత డ్యామేజీ చేయాలన్నది పవన్, చంద్రబాబు ఆలోచనగా ఉంది. అందుకు బాలినేని ఎంత మేరకు ఉపయోగపడతారన్నది కాలమే నిర్ణయించాలి.