వెలుగులోకి కాళేశ్వరం అక్రమాలు

సిరా న్యూస్,కరీంనగర్;
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ‌లో రూ.3 ల‌క్ష‌ల కోట్ల తాగు, సాగు నీటి ప్రాజెక్ట్స్‌కు ప్లానింగ్ జరిగింది. వీటిలో ఎక్కువ ప్రాజెక్టుల కాంట్రాక్టులు మేఘా సంస్థకే దక్కాయి. అయితే, ప్రభుత్వ ఇంజినీర్లతో కుమ్మక్కయి అంచనాల పెంపులో కుట్రలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. దీని స్కెచ్ అంతా మేఘా సంస్థలోనే గీశారు. గతంలో ఈఎన్సీగా పని చేసి, తర్వాత మేఘా కంపెనీలో చేరిన వెంకట రామారావు ఇందులో కీలక పాత్ర పోషించాడు. ఆనాడు ఏం జరిగింది? డిజైన్లలో మార్పులు ఎలా జరిగాయి? అంచనాల పెంపు వెనుక దాగిన రాహస్యాలు ఏంటి? ఇలా అనేక డౌట్స్‌తో ప్రభుత్వ ఇంజినీర్లపై ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై నిజానిజాలు రాబడుతోంది. కానీ, అధికారులు దాటవేత ధోరణిలో ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది.కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. తాజాగా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు విచారణకు హాజరవ్వగా, వారిని ప్రశ్నించింది కమిషన్. మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించింది. బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజులకొకసారి చేసేవారని అధికారులను అడిగింది. రెండు మూడు నెలలకొకసారి అంటూ ఒకరు, అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు సమాధానం ఇచ్చారు. అన్నారం డిజైన్ సరిగ్గా లేదని, వరదకు తగ్గట్టుగా డిజైన్ చేయలేదని ఈఈ వెల్లడించారు. అంతకుముందు, తెలంగాణ ఇంజినీరింగ్‌ రీసెర్జ్ లేబొరేటరీకి చెందిన ఆరుగురు అధికారులను కమిషన్ విచారించింది. మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా వంటి పలు అంశాలపై ప్రశ్నించింది. కానీ, జవాబులు దాటవేసే ధోరణితో ఉండడంతో కమిషన్ మండిపడుతోంది.ప్రభుత్వ ప్రాజెక్ట్ అనగానే, గవర్నమెంట్ ఆఫీసుల్లో ముందస్తు పనులు మొదలుపెడతారు. డిజైన్ల తయారీ, ఇంకా ఇతర పనులకు ప్రిపరేషన్స్ ఉంటాయి. కానీ, కాళేశ్వరం పనులు అలా కాదు. కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఆఫీసులో డిజైన్ల తయారీ జరిగింది. ప్రభుత్వ అధికారులను ప్రలోభపెట్టి, భయపెట్టి తమవైపు తిప్పుకున్నారు. ఉద్యోగాలను సైతం పీకేస్తామని చెప్పి, అంతా తమకు అనుకూలంగా మార్చేశారు. దీనిని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసింది వెంకట రామారావు, శ్రీనివాస్ రెడ్డి. వీళ్లిద్దరూ మేఘా కంపెనీలో చాలా కీలకం. తమకున్న పరిచయాలతో ఇంజినీర్లు తమకు అనుకూలంగా పని చేసేలా ప్లానింగ్‌ అంతా పక్కాగా అమలు పరిచారు.గతంలో ఈఎన్సీగా పని చేసిన వెంక‌ట రామారావు, రిటైర్డ్ అయిన తర్వాత నవయుగ కంపెనీలో పని చేశాడు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో ఆ కంపెనీకి మేలు జ‌రిగేలా టెండ‌ర్ల‌ను త‌యారు చేయించారనే అప‌వాదు ఉంది. తర్వాత కొన్నేళ్లకు న‌వ‌యుగ నుంచి మేఘా కంపెనీలో జాయిన్ అయ్యాడు. భారీగా ల‌బ్ధి చేకూర్చేలా అంచనాలను పెంచడంలో ఈయన దిట్ట. ఈయ‌న చీఫ్ ఇంజ‌నీర్‌గా ఉన్న‌ప్పుడు ప‌నిచేసిన వారు 80శాతం మంది తర్వాత ప్ర‌ధాన‌మైన పోస్టుల్లో ఉండడంతో, వారంద‌రిని న‌యానో, భ‌యానో గుప్పిట్లో పెట్టుకుని, చెప్పింది చేసేలా పని కానిచ్చేశారు. డిజైన్లలో ఇష్టం వచ్చినట్టు మార్పులు చేయించారు. నూనె శ్రీధర్, వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, హరి రామ్, అనిత, శ్రీధర్ దేశ్‌పాండే, ఇలా చాలామంది ఈయన చెప్పింది చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, కొందరు కిందిస్థాయి ఇంజినీర్లకు ఏం తెలియకుండానే కథంతా నడిపించారని అంటున్నారు. వెంకట రామారావును విచారిస్తే, కాంట్రాక్టుల లోగుట్టు అంతా బయటపడుతుంది.ప్రాజెక్టుల్లో రివైజ్డ్ ఎస్టిమేషన్ పెంచేశారు. సాధారణంగా ఆలస్యం వల్ల అంచనాలు పెరుగుతాయి. కానీ, కాళేశ్వరంలో మాత్రం టైమ్‌కే పని చేసినా అంచనాలు పెరగడం వెనుక అనేక అనుమానాలున్నాయి. దాదాపు 258 సార్లు అంచనాలు పెంచారని, ఘోష్ కమిషన్ వివరాలు రాబడుతోంది. కమిషన్ దూకుడుతో కొంతమంది అధికారులు ఉద్యోగం వదిలి వెళ్లేందుకు రెడీగా ఉన్నట్టు అధికార వర్గాల్లో తెగ మాట్లాడుకుంటున్నారు. తరతరాలు తిన్నా తరగని సొమ్మును వెనకేసుకున్నారని, అందుకే ముందే ఉద్యోగాన్ని వదిలేందుకు ప్రిపేర్ అయినట్టు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *