కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థలకు రెడీ అవుతున్నారు. నేతలను అందుకు సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలను చావుదెబ్బ తీసి సత్తా చాటాలనుకుంటున్నారు. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే కాకుండా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకోసం అస్త్రశస్త్రాలను రేవంత్ సిద్ధం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా పథకాలను అందిచి ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకు వెళ్లే ప్రయత్నాలను ప్రారంభించారు. అందుకోసమే రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు సాగడంపైనే చర్చ సాగుతుంది. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడు కూడా రావడంతో అన్ని రకాలుగా ముందుకు వెళ్లి పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అందుకోసమే ప్రత్యేకంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేతలకు నియోజకవర్గాలుగా బాధ్యతలను అప్పగించి అక్కడి ప్రధాన సమస్యలపై రానున్న కాలంలో దృష్టి పెట్టి నోటిఫికేషన్ కు ముందే ప్రజల మనసులను గెలిచే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో స్థానిక సంస్థల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని నేతల ముందు రేవంత్ రెడ్డి ఉంచనున్నట్లు తెలిసింది. దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను మరింత నిర్వీర్యం చేసేందుకు అవసరమైన ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు ప్రతిపక్షాలను బలహీనపరుస్తూనే మరొక వైపు మరిన్ని పథకాలను వీలయినంత త్వరగా అమలు చేయాలన్న నిర్ణయానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం రోడ్డు మ్యాప్ ను నేడు సిద్ధం చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరిన్ని వాగ్దానాలు చేయడమే కాకుండా మిగిలిపోయిన రైతు భరోసా, మహాలక్ష్మి పథకంలో కొన్నింటిని అమలు చేయడంపై నేటి సమావేశంలో చర్చించనున్నారని తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతు రుణమాఫీ చేశామని, అయితే ఇది రైతుల్లోకి బలంగా వెళ్లలేకపోయిందన్న భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకుండా ప్రకటనలు చేయడం ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేయడానికి ఊతమిచ్చినట్లయిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే అందరూ సమన్వయంతో ఒకే మాట మీద ఉండాలని, రైతు రుణమాఫీ అంశంపై కొందరు తప్ప అందరూ మాట్లాడకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద నేడు జరుగుతున్న సమావేశంలో నేతలకు రేవంత్ రెడ్డి అన్ని విషయాలపై కూలంకషంగా దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *