కర్ణాటక సీఎం మార్పు తప్పదా…

సిరా న్యూస్;
కర్ణాటక రాజకీయాలు కూడా నాటకాలను మరిపిస్తుంటాయి. పార్టీలు ఏవైనా ముఖ్యమంత్రి పాత్రలు మారుతుంటాయి. గత రాజకీయ చరిత్ర పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రెండేళ్లు తక్కువగా ప్రతి కొత్త ప్రభుత్వం అలజడులతోనే బాధ్యతలు స్వీకరించడం పరిపాటి. అవినీతి ఆరోపణలు, రాజకీయ అస్థిరత, నాయకత్వానికి సవాళ్లు, తదితర అంశాలు అస్తవ్యస్థ పాలనకు దారి తీస్తున్నాయి. ఓటర్ల నుంచి స్పష్టమైన తీర్పును సాధించినప్పటికీ సిద్దరామయ్య 16 నెలల ప్రభుత్వం అనేక విధాలైన సవాళ్లు, ఒడిదుడుకులకు గురవుతోంది.1980 అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వానికీ ఇదే గడ్డు పరిస్థితి ఎదురైంది. ఆ తరువాత 1989 94 మధ్య ఐదేళ్లలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారారు. ఇది జనతాదళ్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దారి చూపించింది. మళ్లీ 199499 మధ్యకాలంలో చీలికలు తలెత్తాయి. తరువాత ఎస్‌ఎం క్రిష్ణ సారథ్యంలో 1999 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పాలనా కాలంలో కన్నడ కంఠీరవగా పేరొందిన నటుడు రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేయడం ప్రభుత్వానికి అప్రదిష్ట తెచ్చిపెట్టింది. ఆ తరువాత బిజెపి సంకీర్ణ ప్రభుత్వం 2004 నుంచి 2008 వరకు పగ్గాలు చేపట్టినా అస్థిరతకు గురై ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. 2008 నుంచి 2013 వరకు ఇండిపెండెంట్ల మద్దతుతో మనుగడ సాగించింది. 2013 నుంచి 2018 వరకు సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరో ఐదేళ్లు సంకీర్ణ ప్రభుత్వంతో ముగ్గురు ముఖ్యమంత్రులు పీఠమెక్కవలసి వచ్చింది.2018 నుంచి 2023 వరకు మార్పులు కొనసాగాయి. ఇప్పుడు అదే చరిత్ర మళ్లీ తిరిగి రాయవలసిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూమి కేటాయింపు కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ద రామయ్య కూరుకుపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కష్టాలు ఎదురవుతున్నాయి. ముద్దాయిగా ప్రభుత్వం ప్రజల ముందు తలవంచాల్సి వస్తోంది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోడానికి కొంత సమయం పడుతుందని పార్టీలోని కొందరు చెబుతున్నారు. ఈలోగా అనేక ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిందన్న అభిప్రాయం రాకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం సష్టమైన విధానంతో ఉంటోంది. సుస్థిర ప్రభుత్వం అందిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ప్రయత్నిస్తోంది.అయినా ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న అంతర్గత సవాళ్లను ముందు పరిష్కరించడం తక్షణ కర్తవ్యం. ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవప్రదంగా తప్పుకోవడం మొదట జరగాలి. రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిద్దరామయ్య ఇదివరకటి నాయకుల కన్నా కాంగ్రెస్ రాజకీయాల్లో తన ప్రత్యేక శైలిని కనబరిచారు. ఆయన వెనుకబడిన వర్గాల్లో అహింద (కన్నడ మైనార్టీ వర్గాలకు, వెనుకబడిన తరగతులకు, దళితులకు సంకేతం) నాయకుడు. రాజకీయంగా బడుగు వర్గాలనన్నిటినీ ఒకే తాటిపైకి తీసుకురాగల సమర్థుడు. అందుకనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆయనపై కచ్చితమైన అంచనా వేసింది. ఇవే అంశాలు మళ్లీ ఆయన 2023లో ముఖ్యమంత్రిగా రావడానికి దోహదం చేశాయి. అయితే గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు సిద్దరామయ్య ఉనికికి దెబ్బతీశాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అత్యంత జాగ్రత్తగా వ్యూహాన్ని అమలు చేయడం అవసరం.డిప్యూటీ సిఎం డికె శివకుమార్ రేసులో లేకుండా అసలైన వారసుడుగా తనకు తాను భావించుకుంటున్నారు. పార్టీ అధిష్టానం తననే ఎంపిక చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. రాష్ట్రంలో మరికొందరు కాంగ్రెస్ నాయకులు కూడా తాము ముఖ్యమంత్రి పదవికి అర్హత కలిగిన గట్టి అభ్యర్థులమన్న ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఖరి కీలకమవుతుంది. అధికార కాంగ్రెస్ తనకు తానే ఏమీ చేయలేని సందిగ్ధంలో పడితే, దీన్ని అవకాశంగా తీసుకుని ప్రధాన విపక్షం బిజెపి, అసెంబ్లీలో బలబలాల్లో చీలిక తీసుకురాడానికి ఎత్తుగడలు వేయవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంభవించిన ఓటమి నుంచి బిజెపి ఇంకా కోలుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బిజెపి సాధించగలిగినా 2019 నాటి ఫలితాలతో పోలిస్తే ఆమేరకు అంతగా రాలేనట్టే. రాష్ట్ర బిజెపిలో వర్గరాజకీయాలు బాహాటంగానే బయటపడుతున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం ఇందులో జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించడానికి ఇష్టపడటం లేదు. మరో ముఖ్య విషయం జెడిఎస్‌తో పొత్తు రాష్ట్ర బిజెపికి సంకటంగానే తయారైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *