ఎన్వీ రమణకు కీలక పదవి….

సిరా న్యూస్,విజయవాడ;
టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అనూహ్య వ్యక్తికి ఇస్తారని ప్రచారం జరిగింది. తెరపైకి రకరకాల వ్యక్తుల పేర్లు వచ్చాయి. టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో.. రాజకీయ ముద్ర లేనటువంటి వ్యక్తికి ఆ పదవి ఇస్తారని తెగ ప్రచారం నడిచింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పేరు జోరుగా వినిపించింది.రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు ఎన్వి రమణ. కొద్ది రోజుల కిందటే ఆయన పదవీ విరమణ చేశారు. ఏపీ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో ఉండేవారు. పైగా చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు కూడా. చంద్రబాబు విజన్ అంటే ఎన్వి రమణకు ఎంతో ఇష్టం. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో మాజీ న్యాయ కోవిదుడు అయిన.. ఎన్వి రమణకు టీటీడీ అధ్యక్ష పీఠం ఇస్తే మంచి సంప్రదాయానికి తెర తీసినట్టు అవుతుందని విశ్లేషణలు వచ్చాయి.ఆయన తప్పకుండా పదవి తీసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. కూటమి ప్రభుత్వం ఆయనను సంప్రదించినట్లు కూడా టాక్ నడిచింది. కానీ అనూహ్యంగా 24 మంది సభ్యులతో కూడిన టిటిడి ట్రస్ట్ బోర్డును ప్రకటించింది కూటమి ప్రభుత్వం. చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేరును ఖరారు చేసింది. ఎక్కడ ఎన్వి రమణ పేరు వినిపించలేదు. అయితే టీటీడీ కంటే ప్రతిష్టాత్మకమైన ఓ పదవి ఎన్వి రమణకు వరించబోతుందని కొత్త టాక్ ప్రారంభం అయ్యింది.పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీని అగ్రభాగంలో నిలపాలన్నది చంద్రబాబు లక్ష్యం. దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ని కీలకంగా భావిస్తున్నారు. దానికి చైర్మన్ గా ఎన్వి రమణను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏపీ ఈ ఆర్ సి చైర్మన్ హోదా అంటే క్యాబినెట్ తో సమానం. అటువంటి పదవిని ఎన్వి రమణకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ హయాంలో ఏపీ ఈ ఆర్ సి చైర్మన్ గా జస్టిస్ నాగార్జున రెడ్డి వ్యవహరించారు. ఈయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఇటీవలే నాగార్జున రెడ్డి పదవీకాలం ముగిసింది. కొత్త వ్యక్తి నియామకం అనివార్యంగా మారింది. దానికి ఎన్వి రమణ పేరు బలంగా వినిపిస్తోందిఎన్వి రమణ చంద్రబాబుతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఒకానొక దశలో వారి మధ్య సంబంధాలే ఇబ్బందికరంగా మారాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ పేరు ఖరారు చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఏపీ సీఎం గా ఉన్న జగన్ ఏకంగా ఎన్వి రమణ నియామకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. కేవలం చంద్రబాబుకు సన్నిహితుడు కావడంతోనే అప్పట్లో జగన్ అలా వ్యవహరించినట్లు టాక్ నడిచింది. అందుకే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఎన్వి రమణను సంప్రదించిందని.. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు ఒక రకమైన వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీ ఈ ఆర్ సి చైర్మన్ గా ఎన్వి రమణ బాధ్యతలు తీసుకుంటారా? పదవికి సమ్మతిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *