బాలికను ఓ యువకుడు ఎత్తుకొని వెళ్తుండగా పట్టుకున్న కుటుంబసభ్యులు
సిరా న్యూస్,హైదరాబాద్;
మూడు సంవత్సరాల బాలికను కిడ్నాప్ కు పాల్పడిన యువకుడిని బండ్లగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్లగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అల్ జుబేల్ కాలనీ లో ఆదివారం సాయంత్రం అదే ప్రాంతానికి చెందిన మూడు సంవత్సరాల మైనర్ బాలిక ఇంటి బయట ఒంటరిగా ఆడుకుంటుంది. ఆదే ప్రాంతానికి చెందిన సోహైల్ (25), సదరు బాలికను చంకన ఎత్తుకొని చాంద్రాయణగుట్ట చౌరస్తా లోని మహంకాళి ఆలయం రూట్ లో తీసుకెళ్లాడు. అప్పటికే వెతుకుతున్న బాలిక కుటుంబ సభ్యులు, నిందితుడిని పట్టుకొని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండ్లగూడ పోలీసులు సోహైల్ పై కిడ్నాప్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సోహైల్ మాత్రం తాను కిడ్నాపర్ ను కాదని, బాలిక తప్పి పోయిందని వారి తల్లి దండ్రులకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పడం గమనార్హం.