కూతురి కోసం కోలగట్ల పవన్ జపం

సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో ముందు వరుసలో ఉంటారాయన. జిల్లాలో దిగ్గజ వంశాన్ని ఎదుర్కొన్ని రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి మాస్ లీడర్ మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత సొంత పార్టీ వారికే కనిపించడం మానేశారు. పవర్‌లో ఉన్నప్పుడు హెలికాఫ్టర్‌తో పూలు జల్లించుకున్న ఆ ఘనాపాటి.. ఇప్పుడు ముఖం చాటేయడంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ లీడర్ ఎవరో తెలుసా? కోలగట్ల వీరభద్ర స్వామి.మొదట కాంగ్రెస్ , తర్వాత ఇండిపెండెంట్ , ఆ తర్వాత వైసీపీ ఇలా సాగిన కొలగట్ల రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకోబోతుందని అంటున్నారు. కొలగట్ల జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీలు మారినా విజయనగరం జిల్లా కేంద్రంలో స్వామికి మంచి పట్టు ఉంది. మాస్ లీడర్ గా ఆయనకి ఉన్న గుర్తింపు ఇంకెవ్వరికీ లేదనే చెప్పాలి. అశోక్ గజపతిని, ఆయన కుమార్తెని కూడా ఓడించిన చరిత్ర ఆయనది.ఎన్ని సార్లు ఓడిన పట్టువడాలని విక్రమార్కుడిలా పోరాటం చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అశోక్‌గజపతిరాజుని, ఆయన కుమార్తె అదితిని ఓడించిన ఘనత దక్కించుకున్నారు. అందుకు తగ్గట్లు కేడర్ ను కూడా బలోపేతం చేసుకున్నారు. అంతటి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ కాబట్టే 2014లో కొలగట్ల ఓడిపోయినప్పుడు జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీని చేశారంటారు. మాస్ ఇమేజ్‌కి తగ్గట్లే అవినీతి మరకలను అంటించుకున్నారనే టాక్ నడుస్తోంది.
గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అన్ని వ్యాపారాలలో వాటాలు మాత్రమే కాకుండా , కొన్నిటిని దబాయించి మరీ లాక్కున్నారనే అపప్రద కూడా మూటగట్టుకున్నారట. రియల్ ఎస్టేట్‌లో అయితే తన సొంత ఎస్టేట్ అన్నట్లు దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చిన్న అల్లుడు ఈశ్వర్ కౌశిక్‌పై గంజాయి సరఫరా ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.చిన్న కుమార్తెను మున్సిపల్ కార్పొరేషన్ డెప్యూటీ మేయర్ గా చేసి కార్పొరేషన్ సొమ్మును దోచుకున్నారని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఒడిపోవడానికి కరణమనే వాదనలూ ఉన్నాయి. విజయనగరం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రత్యర్ధి అదితి గజపతిరాజు ఆయనపై 60 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదంతా కొలగట్ల అవినీతి ఫలితమే అంటున్నారు.గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత సారు చేసిన అతి అంతా ఇంతా కాదు. డిప్యూటీ స్పీకర్ పదవి రాగానే విజయనగరంలో ర్యాలీ నిర్వహించి హెలీకాప్టర్ నుండి పూలు జల్లించుకున్న ఘనత ఆయనది. ఆ తర్వాత ప్రెస్ మీట్‌ల మీద ప్రెస్ మీట్‌లు పెట్టి విజయనగరంలో ఉన్న అశోక్ గజపతిరాజు నుంచి అమరవతిలో ఉన్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లను ఆయన తిట్టని తిట్టు లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జగన్ మెప్పు కోసం పవన్‌కళ్యాణ్ పై ఒక రేంజ్లో రెచ్చిపోయారు.తాను సరిపోను అన్నట్లు మాజీ మంత్రి బొత్స నుండి ఎంపి , ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించి మరీ ప్రెస్ మీట్‌లు పెట్టించి తిట్టించేవారు. చంద్రబాబును సీఎం ను చేయడానికె పవన్ కళ్యాణ్ ఆరాటం అంటూ హేళన చేసిన సందర్భాలూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి రాజకీయం అంటే తెలుసా అంటూ చులకనగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు స్పాట్ ఇతే ఇదంతా ఇప్పుడెందుకు అంటే.. సారు ఇపుడు జనసేనలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా గాజు గ్లాసు గూటికి చేరాలని ప్రదక్షిణలు చేస్తున్నారంట.అయితే, ఇదంతా తన రాజకీయ భవిష్యత్తు కోసం కాదంట.. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన తన చిన్న కుమార్తె కొలగట్ల శ్రావణి రాజకీయ భవిష్యత్ కోసమే అంటున్నారు. మొన్న ఎన్నికల్లోనే కుమార్తెను రంగంలోకి దింపుదామని అనుకున్నప్పటికీ జగన్ దానికి ఒప్పుకోలేదంట. అయితే కొలగట్ల దాయదులు అవనాపు , గురాన కుటుంబాలు ఇప్పటికే జనసేనలో చేరడం , కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు కావడంతో స్వామికి నిద్ర పట్టడం లేదట. ఎలాగైనా జనసేనలో చేరి దాయదులకు చెక్ పెట్టడంతో పాటు నియోజకవర్గంలో జనసేనకి పెద్ద దిక్కుగా మారాలని ఉవ్విళ్లూరుతున్నారట.
స్వామి జనసేనలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్తిస్తుండటంతో రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలడం లేదని అవనాపు, గురాన ఫ్యామిలీలు తెగ ఇదైపోతున్నాయంట. కానీ కొలగట్ల చెరికకు జనసేన ముఖ్య నాయకులు ఇప్పటికే ససేమిరా అన్నారనే టాక్ నడుస్తోంది. దీంతో స్వామి రూటు మార్చి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న పెద్ద అల్లుడుతో మంతనాలు జరుపుతున్నారట. పెద్ద అల్లుడు ద్వారా జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కి రాయబారాలు పంపుతున్నారంట.గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కి 48 డివిజన్లలో వైసీపీ గెలిచింది.. అప్పటి నుంచి నిన్న మొన్నటివరకు కార్పొరేషన్‌ను ఒంటి చేత్తే శాసించారాయన … అలాంటాయన ఓటమి తర్వాత ఇల్లు కదలడం లేదు సరికదా , ఎవ్వరినీ రానివ్వడం లేదంట. దానికి కారణం ఆయన జనసేనలో చేరిన తర్వాతనే కార్పొరేషన్ పై ఫోకస్ చేస్తారని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో కార్పొరేషన్‌ను జనసేనకు గిఫ్ట్‌గా ఇస్తానని ప్రతిపాదనలు పెడుతూ పార్టీ మారాలని చూస్తున్నారంట. మరి చూడాలి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *