పవన్ మార్క్ పాలిటిక్స్…

సిరా న్యూస్,ఏలూరు;
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. గతంలో ప్రజా ప్రతినిధిగా కూడా చేయని ఆయన నేరుగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఏరి కోరి పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్నారు. ఆయన అలా తీసుకోవడం వెనుక ప్రతి పల్లెలో తనదైన ముద్ర వేయాలన్న సంకల్పం ఉందని తాజాగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో స్పష్టమవుతోంది. గ్రామ సీమల్లో గత ఐదేళ్ల పాటు జరగని పనుల్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఇందు కోసం పల్లె పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఖరారు చేశారు. పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహింప చేశారు. అందుకు వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ అవార్డు కూడా లభించింది. ఆ గ్రామ సభలను రికార్డు కోసం నిర్వహించలేదు. గ్రామాల్లో ఉన్న సమస్యలను నమోదు చేసుకున్నారు. ప్రాధాన్యతా క్రమంలో ఏ ఏ పనుల్ని చేయాలో కూడా ఆయా పంచాయతీలే ప్రజల అభిప్రాయాల మేరకు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు ఆయా పనుల్ని చేయించడానికి పవన్ కల్యాణ్ ఏర్పాట్లు చేశారు. పూర్తి స్థాయిలో నిధుల లభ్యత, కొరత లేకుండా చూస్తూ అభినృద్ధి పనుల్ని ప్రారంభించేందుకు పల్లె పండుగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఖరారు చేశారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో చిన్న చిన్న పనులకూ అవకాశం లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి ఉంది. రోడ్ల దగ్గర నుంచి అనేక మౌలిక సదుపాయాల పనులు జరగాల్సి ఉంది. గ్రామ సభల్లో ఎక్కువగా ఇలాంటి పనులకు ప్రతిపాదనలు వచ్చాయి.దీ దీంతో పవన్ కల్యాణ్ గ్రామ సభల ద్వారా ఆయా పనులకు ఆమోదం తీసుకున్నారు 2024–25 ఏడాదికిగాను రూ.4,500 కోట్ల నిధులతో పనులకు గ్రామ సభల ఆమోదం తెలిపేలా చేయగలిగారు. ఈ పనులన్నింటినీ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పనుల ప్రారంభం కోసం ప్రత్యేకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని ఖరారు చేశారు. 30 వేల పనులకి పల్లె పండుగలో శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రతి విషయంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా చూసుకుంటున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు మంజురైన పనులకు పండుగ వాతావరణంలో భూమిపూజను పల్లె పండుగలో చేయనున్నారు. అక్టోబర్‌ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు’ జరుగుతాయి. రాజకీయంగా సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టి హిందూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న పవన్ కల్యాణ్ మరో వైపు తన బాధ్యతల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయడం లేదు. సమర్థవంతమైన అధికారుల టీమ్ ను ఏర్పాటు చేసుకున్న ఆయన తన ఆలోచన మేరకు పనులు శరవేగంగా జరిగేలా చూసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ పవన్ కల్యాణ్ పనులు చేయించారు అనే ముద్ర ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్ కూడా ఆయన మంచి గుర్తింపు సాధించడం ఖాయమని అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *