సిరా న్యూస్,హైదరాబాద్;
సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ విచారణ మొదలైంది. ఐదు రోజులపాటు లక్ష్మి నారాయణను ఈడీ ప్రశ్నించనుంది. మొదటిరోజు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. సాహితీ ఇన్‌ఫ్రా పేరు మీద వేల మంది దగ్గరి కోట్లాది రూపాయలు వసూలు చేశాడు లక్ష్మినారాయణ. చాలా డబ్బును సొంతానికి వాడేసుకున్నాడు. చెప్పిన టైమ్‌కు కస్టమర్లకు ఇళ్లు అందించలేదు. దీంతో వారంతా సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది. అధికారులతో కుమ్మక్కై, తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ, ఈడీ ఎంట్రీతో కేసు కీలక మలుపు తిరిగింది.రూ. వేల కోట్ల స్కామ్ కావడంతో తర్వాత ఈడీ ఎంటర్ అయింది. కేసు నమోదు చేసి పీఎంఎల్ఏ యాక్ట్ కింద సెప్టెంబర్ 29న లక్ష్మినారాయణను అరెస్ట్ చేసింది. అతడ్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరగా, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్‌లో ఇంకా ఎవరెవరి పాత్ర వుందన్న దానిపై ఐదు రోజులపాటు లక్ష్మినారాయణను ప్రశ్నిస్తోంది. ప్రీ లాంచ్ ఆఫర్లతో దాదాపు 1600 మంది కస్టమర్ల నుంచి 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు విచారణ అధికారులు. సాహితీ ఇన్‌ఫ్రా, లక్ష్మినారాయణ లావాదేవీల వివరాలను, ఇష్టారాజ్యంగా జరిగిన క్యాష్ పంపకాలను జనం ముందు ఉంచింది. ఇదే క్రమంలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో సాహితీతో లింక్స్ ఉన్నవారిలో భయం మొదలైంది. అయితే, అధికారులు అంతవరకు వెళ్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. విచారణలో మాత్రం అన్ని విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.