సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 92 నియోజకవర్గాల్లో 641 పనులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.1377.66 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నా గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం పట్టుబట్టి నిధులు సాధించారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.దివ్యాంగులు ఇకపై అధికారుల చుట్టూ తిరగనక్కర్లేదని సీతక్క అన్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ దివ్యాంగుల జాబ్ పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ, ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఇతర వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయని, శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదని అన్నారు. పోషకాహార లోపం, ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుందన్నారు. అందుకే వాళ్లకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభించామని తెలిపారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలని, దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుంటే చాలని అన్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయని, అందుకోసమే ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చామని సీతక్క స్పష్టం చేశారు.సంక్షేమ నిధుల నుంచి ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామని, ప్రైవేట్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు మంత్రి. గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తామని చెప్పారు. సంక్షేమం, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టం చేశారు. దివ్యాంగుల పరికరాల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దివ్యాంగులు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా తమకే వారి సమస్యలను షేర్ చేయొచ్చునని, మెసేజ్ పాస్ చేస్తే చాలని వారి సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. బ్యాక్ లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న వీటి భర్తీ ప్రక్రియ మొదలుపెట్టామని సీతక్క తెలిపారు. దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం చేయూతనిస్తామని చెప్పారు.