సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ ప్రక్షాళన… తెలంగాణ రాజకీయాల్లో రచ్చకు దారితీసిన అంశం. దీనిపై అపోజిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అధికార పార్టీ లీడర్లు మాత్రం అదే మూసీ సుందరీకరణ కోసం అధ్యయనమంటూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అనుమానాలు.. అభ్యంతరాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం వదిలేసి.. పవర్లో ఉన్న పార్టీ లీడర్లు స్టడీ టూర్కు వెళ్లడం ఏంటంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.మూసీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకునే ముందే సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియా వెళ్లి..హన్ నదిని పరిశీలించి వచ్చారు. ఆ తర్వాతే..మూసీ ప్రక్షాళన కోసం చర్యలు చేపట్టారు. డీపీఆర్ కోసం ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అంతలోపు మూసీ పరివాహక ప్రాంతంలో సర్వేలు, మార్కింగ్చేసే ప్రాసెస్ జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంతవాసుల్లో ఉంటున్న జనాలను ఒప్పించి మరో చోటకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇలా ఓ వైపు అంతా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటే.. సడెన్ గా ఇప్పుడు మంత్రులు, వలస ఎమ్మెల్యేలు, కొందరు అధికారులు హన్ నదిపై అధ్యయనం కోసం దక్షిణ కొరియాకు వెళ్లడం ఎందుకనే చర్చ సాగుతోంది.స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సియోల్ వెళ్లి, హాన్ నదిని చూసి, మూసీ ప్రక్షాళను ఏం చేయాలో డిసైడ్ అయ్యాక.. ఇప్పుడు మళ్లీ ఇద్దరు మంత్రులు, వలస ఎమ్మెల్యేలు వెళ్లి హాన్ నదిని చూసి మాత్రం చేసేదేముందన్న సందేహం కలుగుతోందట చాలా మందిలో. ఎందుకంటే మూసీ పునరుజ్జీవంపై సందేహాలు ఉన్నది ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు. అవసరమైతే బీఆర్ఎస్, బీజేపీ నేతలను సియోల్ తీసుకెళ్లి వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి.అంత ఈజీ కాదనుకుంటున్న మూసీ ప్రక్షాళను ఏవిధంగా సుసాధ్యం చేయాలనుకుంటున్నారో హాన్ నదిని ప్రత్యక్షంగా చూపించి అర్థమయ్యేలా చేయాలి. కానీ అది వదిలేసి అల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి హాన్ నదిపై స్టడీ చేసి. పనులే మొదలుపెట్టాక.. ఇప్పుడు మంత్రులు, వలస ఎమ్మెల్యేలు వెళ్లి మాత్రం ఉపయోగం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇందులో భాగంగా సియోల్ వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్యనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా చెప్పే అవకాశమూ లేకపోలేదనే చర్చ సాగుతోందిజ అయితే ప్రభుత్వం తీసుకెళ్తానంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు సియోల్కు వస్తారా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్లు వస్తారో రారో.. సియోల్కు మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లే ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించి ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు మూసీ ప్రాజెక్టు పేరుతో ఏదో విహార యాత్రకు వెళ్లినట్టు ఉంది తప్ప..వాళ్లు వెళ్ళి అక్కడ స్టడీ చేసేదేముందన్న గుసగుసలు సచివాలయవర్గాల్లో వినిపిస్తున్నాయి.