సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో బీసీల కులగణనకు ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.తాజాగా బీసీలతో పాటే ఎస్సీ, ఎస్టీల కులగణన సర్వే సైతం చేపట్టేందుకు సర్కార్ ఒకే చెప్పేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఇక స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఇప్పట్నుంచే ఎన్నికలకు సన్నద్ధం అవడం ప్రారంభించారు.దసరా పండుగకు ఒక్కరోజు ముందే సర్కారు కులగణన సర్వేకు సంబంధించిన జీఓ 18ను జారీ చేసింది. ఫలితంగా లోకల్ బాడీస్ అభ్యర్థుల్లో సంతోషం నెలకొంది. ఇదే అవకాశమని భావించి, దసరా పండుగ రోజున తమ ఉనికిని చాటేందుకు పెద్ద ఎత్తున తమ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు.మరోవైపు బీసీ కులగణన లేకుండా గ్రామ పంచాయతీకి ఎన్నికలను నిర్వహించొద్దని ఓవైపు బీఆర్‌ఎస్, ఇంకోవైపు బీజేపీలు పట్టుబట్టాయి. ఇక బీసీ సంఘాలు అయితే రిజర్వేషన్లు తేలకుండా ఎన్నికల ప్రస్తావన తీసుకురాకూడదని అల్టిమేటం జారీ చేశాయి.ఒకదశలో బీసీ సంఘాలు హైకోర్టును సైతం ఆశ్రయించాయి. పిటిషన్లను విచారించిన ఉన్నత న్యాయస్థానం, బీసీ కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం సూచనల మేరకు ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలోనే కులగణన పూర్తైన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అసలు లోకల్ బాడీస్ అంటేనే గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు. పల్లెల్లో కీలకమైన ఈ ఎన్నికలపై ఈసారి బీసీలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 4న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని సైతం ప్రవేశపెట్టింది. ఇదే సమయంలో బీసీ కులగణనపై పలు రాష్ట్రాల్లోని స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం అధికారులను పంపించింది. ఈ సందర్భంగా అధ్యయనం వివరాలు ప్రభుత్వానికి అందడంతో కులగణనకు సర్కారు పచ్చజెండా ఇచ్చేసిందికులగణన బాధ్యతను ప్రభుత్వం ప్రణాళిక శాఖ భూజంపై మోపింది. కులగణన పూర్తయ్యే వరకు ప్రణాళికా శాఖనే నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు నిర్వర్తించనుంది. బీసీ కులగణనకు అధనంగా ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల కులాల సర్వేని చేపట్టాలని జీఓలో ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ఇక సామాజిక, ఆర్థికపరమైన స్థితిగతులే కాకుండా విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలపైనా సర్వే చేయాలని ఆదేశించింది.ఈ మొత్తం ప్రక్రియను కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేయాలని సదరు జీఓ ద్వారా చెప్పింది. సర్వేకు సంబంధించిన మార్గదర్శకాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతోనే సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఒకటి, రెండు రోజులోనే వెలువడే అవకాశాలున్నాయని ప్రణాళిక సంఘం అధికారులు అంటున్నారుఇదే సంవత్సరం ఫిబ్రవరి 2న గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తయిపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, స్థానిక సంస్థల ఎన్నికల వైపు మొగ్గు చూపించలేదు. దీంతో గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది.కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రెఢీగా ఉన్నా బీసీ కులగణన కారణంగా ఎన్నికలు సకాలంలో నిర్వహించలేకపోయింది. ఎన్నికల సంఘం మాత్రం తమపని తాము చేసుకునిపోయింది.అసెంబ్లీ ఓటర్ల జాబితాలను అనుసరించి గ్రామ పంచాయతీలు, వార్డుల లెక్కన గతనెల 29నాటికే ఫైనల్ జాబితాను సంసిద్ధం చేసింది. ఓటర్ జాబితాలను సైతం రెఢీగా పెట్టారు. కుల గణన సర్వే వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది.స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఖరారు చేశాకే ఎన్నికలను నిర్వహించనుంది ప్రభుత్వం. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ సర్వే ప్రక్రియ పూర్తికానుంది. ఈలోగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల స్థితిగతులపై ప్రభుత్వానికి ఓ అంచనా వస్తుంది. మొత్తం కులగణన సర్వే తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు అవుతుందని సమాచారం.