Manda Anusha: ఉపాధ్యాయురాలిగా పోస్టింగ్ అందుకున్న పేదింటి బిడ్డ.. మంద అనూష

సిరాన్యూస్, చిగురుమామిడి
ఉపాధ్యాయురాలిగా పోస్టింగ్ అందుకున్న పేదింటి బిడ్డ.. మంద అనూష

ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మంద అనూష ప్రతిభ కనబర్చింది. ఈనెల 8న గణితం ఉపాధ్యాయురాలిగా (స్కూల్‌ అసిస్టెంట్‌) పోస్టింగ్‌ అందుకుంది. అనూషది పూర్తిగా నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు మంద మణెమ్మ, భూమయ్యలు నిరక్షరాస్యులు. వారికి ముగ్గురు కూతుళ్లు సంతానం. రెండో కూతురైన అనూష చిన్నప్పటి నుంచే చదువులో ముందుంది. అదే సంకల్పంతో వెనుకడుగు వేయకుండా చదువుకుంది. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో.. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇందుర్తిలోని జిల్లా పరిషత్ స్కూల్‌లో.. ఎల్కతుర్తిలోని గురుకులంలో ఇంటర్ పూర్తి చేసింది. కరీంనగర్‌లోని ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ (బీఎస్సీ, ఎంపీసీఎస్‌) పూర్తి చేసింది. అలాగే శ్రీచైతన్య కళాశాలలో ఎమ్మెస్సీ అభ్యసించింది. హుస్నాబాద్‌లోని సంఘమిత్ర కళాశాలలో బీఎడ్‌ పూర్తి చేసిన ఆమె.. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో 75వ ర్యాంకు సాధించింది. తాజాగా ఈనెల 8న నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో గణితం ఉపాధ్యాయురాలిగా పోస్టింగ్‌ సాధించింది. ఆమెను గ్రామ మాజీ సర్పంచ్ సన్నిల వెంకటేశ్‌, ఉపసర్పంచ్ అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, గాగిరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు మంద శ్రీనివాస్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *