మైలేజ్… డ్యామేజ్…

సిరా న్యూస్,వరంగల్;
ప్రస్తుతం తెలంగాణ రాజకీయం అంతా కొండా సురేఖ చుట్టూ తిరుగుతోంది. ఇటు కాంగ్రెస్.. అటు సినిమా ఇండస్ట్రీ నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నా.. బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది. దీంతో బీఆర్ఎస్‌కు పొలిటికల్ మైలేజ్.. కాంగ్రెస్‌కు డ్యామేజ్ అనే చర్చ జరుగుతోంది.కొండా సురేఖ.. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫైర్ బ్రాండ్ లీడర్. కొండా ఫ్యామిలీ అంటే అదో రకమైన ఫీలింగ్ జిల్లా ప్రజలకు ఉండేది. కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. అనేక రాజకీయ పరిణామాల మధ్యలో కొండా ఫ్యామిలీ మళ్లీ హస్తం గూటికి చేరింది. అందరూ అనుకున్నట్టే సురేఖ విజయం సాధించి.. మంత్రి కూడా అయ్యారు.ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. అసలు సమస్య ఈ మధ్యే మొదలైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మాజీమంత్రి బస్వరాజు సారయ్య కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయన ఇదే నియోజకవర్గం నుంచి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. ఆయనకూ ఓ వర్గం సపోర్ట్ బాగా ఉంది. ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండటంతో చాలా రోజులుగా కోల్డ్ వార్ జరుగుతోంది.ఈ వార్ జరుగుతుండగానే.. కొండా ఫ్యామిలీ ప్రధాన అనుచరుడు ఒకరు వార్తల్లోకి ఎక్కారు. ఆయన పోరు పడలేకపోతున్నామని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ప్రభుత్వ పెద్దల వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో సర్కారు ఇంటలిజెన్స్ అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని.. అతనికి ఉన్న సెక్యూరిటీని తొలగించింది. త్వరలోనే అతనిపై చర్యలుంటాయనే ప్రచారం జరుగుతోంది.సరిగ్గా ఈ సమయంలో.. కొండా సురేఖ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు కానీ.. సినిమా ఇండస్ట్రీని టచ్ చేశారు. అది కూడా మామూలుగా కాదు. ఏకంగా సినిమా ఇండస్ట్రీ అంతా ఏకమయ్యేలా మంత్రి కామెంట్స్ ఉన్నాయి. దీంతో కొండా సురేఖ టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారారు. పార్టీ తేరుకొని వివరణ ఇప్పించే ప్రయత్నం చేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అక్కినేని నాగార్జున కోర్టు మెట్లెక్కి.. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇష్యూ అత్యంత సున్నితమైంది కావడంతో.. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొండా సురేఖతు సపోర్ట్ చేసేవారు లేకుండా పోయారు. ఏం మాట్లాడితే.. మన మెడకు ఏం చుట్టుకుంటుందోనని కాంగ్రెస్ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. అందుకే సైలెంట్‌గా ఉండటం బెటర్ అనే అభిప్రాయంలో ఉన్నట్టు.. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కానీ.. ఆ విషయం పక్కకుపోయి.. సమంత- నాగచైతన్య విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో సినీ ప్రముఖులు అంతా ముక్తకంఠంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. కేటీఆర్‌పై ఈ స్థాయిలో ఆరోపణలు చేసినా.. బీఆర్ఎస్ మాత్రం వ్యూహాత్మకంగా మౌనంగా ఉంది. గులాబీ నేతలు ఎక్కడా ఈ ఇష్యూ గురించి మాట్లాడటం లేదు.బీఆర్ఎస్ మౌనం కారణంగా.. ఇప్పుడు వివాదం అంతా సినిమా ఇండస్ట్రీ, కాంగ్రెస్ పార్టీ మధ్య నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా విషయంలో అనేక ప్రశ్నలను ఎదుర్కొంటుంది. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చినప్పటి నుంచి ఇండస్ట్రీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అప్పుడు ఓ నిర్మాత ఇంట్లో కొందరు సినీ ప్రముఖులు భేటీ అయ్యి.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై చర్చించినట్టు వార్తలు వచ్చాయి.ఆ ఇష్యూ పూర్తిగా సమసిపోకముందే.. తాజాగా కొండా సురేఖ కామెంట్స్ అగ్గిలో ఆజ్యం పోసినట్టు అయ్యాయి. కూల్చివేత సమయంలో స్పందించని వారు కూడా ఇప్పుడు స్పందించి.. కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో మౌనంగా ఉండటమే తమకు మంచిదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు ఏది మాట్లాడినా రాజకీయంగా నష్టం జరగవచ్చని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా ఉన్న పొలిటికల్ ఫైట్ ఇప్పుడు సైడ్ టర్న్ తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ రిలాక్స్ అవుతోంది. అటు గులాబీ పార్టీ కూడా నేతలకు గట్టి సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎవరు ఎంత రెచ్చగొట్టినా ఈ వ్యవహారంలో తలదూర్చవద్దని కీలక నేతలు వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఏం మాట్లాడినా.. చర్యలు తప్పవని హెచ్చరించినట్టు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *