పీసీసీ చీఫ్ నిర్ణయం వెనుక పెద్ద ప్లాన్..
సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రజా ప్రభుత్వంగా చాటుకుంటున్న రేవంత్‌రెడ్డి సర్కార్… ఇప్పుడు పార్టీ బాట పట్టనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధంగా పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను తెలుసుకోవాలని నిర్ణయించిన పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్…. ముఖ్యమంత్రి, మంత్రులంతా గాంధీభవన్‌కు రావాలని తాజాగా ప్రతిపాదించారు.ప్రభుత్వమంటే సచివాలయం, అసెంబ్లీ.. ముఖ్యమంత్రి, మంత్రులే కాదని ప్రభుత్వంలో పార్టీ కూడా ఓ భాగమని చెప్పాలనుకున్న పీసీసీ చీఫ్.. నెలకొకసారైనా సీఎం రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లో అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.. అదేవిధంగా మంత్రులు కూడా వారానికి రెండుసార్లు పార్టీ క్యాడర్ కష్టనష్టాలు తెలుసుకునే విధంగా గాంధీభవన్‌కు రావాలని సూచించారు. పీసీసీ చీఫ్ ప్రతిపాదనకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై మంత్రులు వారం వారం గాంధీభవన్‌లో ప్రత్యక్షం కావడం తప్పనిసరిగా మారింది.వాస్తవానికి ప్రజా ప్రభుత్వంగా తొలి నుంచి చెబుతున్న రేవంత్‌రెడ్డి సర్కార్.. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రజా భవన్‌లో ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టింది. తొలుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క వంటి వారు కొద్దిరోజులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమ బాధ్యతలను ఆ తర్వాత ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డికి అప్పగించారు.ఈ కార్యక్రమం ప్రభుత్వ పరంగా నిర్వహిస్తుండగా, మంత్రులను ఇన్‌వాల్వ్ చేస్తూ… వారిని గాంధీభవన్ రప్పించే ప్లాన్ చేశారు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్. కొద్ది రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నా… ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. కానీ, పార్టీలో తన మార్క్ చాటుకోవాలనే ప్రయత్నంతో మహేశ్‌కుమార్ గౌడ్ కొత్త స్కీమ్‌కు తెరతీశారా? అన్న చర్చ జరుగుతోంది.పార్టీ కార్యాలయంలో మంత్రులు అందుబాటులో ఉండాలని పీసీసీ చీఫ్ నిర్ణయించడంతో సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ప్రజాభవన్‌లో మంగళ, శుక్రవారాలు జరుగుతుండగా.. గాంధీభవన్‌లో బుధ, శుక్రవారాల్లో మంత్రులు అందుబాటులో ఉండేలా నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో మంత్రులకు విడతల వారీగా గాంధీభవన్ డ్యూటీ వేస్తారని చెబుతున్నారు.పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో కొనసాగాలంటే కార్యకర్తలను ప్రోత్సహించాల్సి వుందన్న ఆలోచనే ఈ కార్యక్రమానికి ప్రేరణగా చెబుతున్నారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలో ప్రతి రోజూ ప్రజల నుంచి మంత్రులు ఫిర్యాదులు స్వీకరిస్తుండటం కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆకర్షించిందని అంటున్నారు.మరోవైపు రాష్ట్రంలో ఎంఐఎం వంటి చిన్న పార్టీలు సైతం తమ ఎమ్మెల్యేలను పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారని… అందువల్లే ఎంఐఎం పార్టీ పాతబస్తీలో పాతుకుపోయిందని ప్రచారం ఉంది. ఇవన్నీ గమనించే రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు కూడా పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా పీసీసీ చీఫ్ ప్రతిపాదించారంటున్నారు. ఇక సీఎం కూడా ఓకే చెప్పడంతో వచ్చే వారమే ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నా… కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అసలే కాంగ్రెస్‌లో నేతల తాకిడి ఎక్కువ… వారి కోరికలకు అడ్డూ అదుపు ఉండే పరిస్థితి లేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రులను పార్టీ కార్యాలయానికి రప్పించడం ద్వారా కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీలకు దీటుగా తయారు చేయాలనే ప్లాన్ కనిపిస్తున్నా… సీనియర్ నేతల తాకిడి ఎక్కువగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఈ కార్యక్రమం సవాల్‌గానే చెబుతున్నారు. మరి ఈ సవాల్‌ను ఆ పార్టీ యంత్రాంగం ఎలా అధిగమిస్తుందనేది చూడాల్సివుంటుంది. మొత్తానికి నయా పీసీసీ చీఫ్ స్ట్రాటజీ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.