ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు!!
కౌశిక్ ఇంటి వద్ద ఉత్కంఠ
సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ లోని హుజురాబాద్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద గురువారం వేకువ జాము నుండి తీవ్ర ఉత్కంఠ ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులను ఆయన ఇంటి వద్ద మొహరించారు. ఆయనను గృహనిర్బంధం చేసినట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేయవచ్చని పోలీసు వర్గాల సమాచారం. ఇటీవల పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నాలుగు వారాల్లో చర్య తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను పార్టీ మారలేదని బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాను గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్తానని ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుండి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కౌశిక్ బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికి వెళ్లకుండా ఉండేందుకే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హతపై చర్య తీసుకోవాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.