సిరా న్యూస్,విజయవాడ;
తిరుమల లడ్డూ వివాదంలో పవన్ తీరు మరింత చర్చకు దారితీస్తోంది. జాతీయస్థాయిలో సైతం హాట్ టాపిక్ గా మారింది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలిపారని వివాదం రేగిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యవహారం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేయడానికి ఆవు నెయ్యి ఉపయోగిస్తారు. ఈ ఆవు నెయ్యిని ఏఆర్ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. గత జూలైలో ఈ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ లో కల్తీ జరిగిందని నివేదిక ద్వారా తెలిసింది. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఫలితంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని వార్తలు బయటికి రావడం మొదలయింది. వాస్తవానికి ఇలాంటి విషయాలు టిటిడి ఈఓ చెబుతారు. అయితే ఒక అధికారి గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పలేడు.. అందులో ఉన్న విషయాలను స్పష్టంగా వివరించలేడు. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారు. శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని.. దీనంతటికీ జగన్ ప్రభుత్వం హయాంలో ఏఆర్ అనే కంపెనీ తో కుదుర్చుకున్న ఒప్పందమే కారణమని చంద్రబాబు స్పష్టం చేశాడు.. అంతే ఏపీలో రాజకీయ మంటలు చెలరేగాయి. అంతకుముందు ఆ నివేదికలో ఉన్న విషయాలను టిటిడి ఈవో కు బదులుగా టిడిపి నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియా ముందు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా జగన్ ఇరుకున పడాల్సి వచ్చింది. వాస్తవానికి ఆ నివేదికలో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి ఉందని ఈవో చెప్పగా.. అందులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడంతో దుమారం చెలరేగింది.నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా జగన్ క్రైస్తవుడు కావడంతో.. తిరుమల సంబంధించి ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు గట్టిగా స్పందించలేదు. తిరుమలలో పెద్ద పెద్ద పోస్టులలో వివాద రహితులను నియమించకుండా.. ఆరోపణలు ఉన్న వ్యక్తులను నియమించాడు. దీంతో తిరుమలలో ఏవైనా వివాదాలు చోటు చేసుకున్నప్పుడు వారు పెద్దగా పరిష్కరించింది లేదు. ఇదే సమయంలో అన్యమత ప్రచారం.. తిరుమలలో ఫోటో షూట్.. ఆలయ ప్రధాన గోపురంపై డ్రోన్ చక్కర్లు కొట్టడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు నెయ్యి కల్తీ వ్యవహారం తెరపైకి రావడంతో.. గతంలో చోటు చేసుకున్న సంఘటనలను కూడా ప్రస్తుత ప్రభుత్వం చర్చకు పెడుతోంది. తనకు అనుకూల మీడియాలో రాయిస్తోంది. దీంతో జగన్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి నెయ్యి కల్తీ వ్యవహారానికంటే తిరుమల లడ్డు తయారీలో అపచారం చోటుచేసుకుందనే భావన దేశవ్యాప్తంగా జగన్ పై ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ ఆగ్రహం మంటల్లో టిడిపి అనుకూల మీడియా మరింత నెయ్యి చల్లుతోంది. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడే కాపాడాలి. నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పోస్టులలో కొనసాగిన వారు జగన్ కు అనుకూలంగా మాట్లాడలేకపోతున్నారు. పైగా వారు చెప్పే వివరాలు అస్పష్టంగా ఉంటున్నాయి. ఇవి అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు తన రాజకీయ చాణక్యానికి మరింత పదును పెడుతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లడంతో.. లడ్డు వ్యవహారం మరింత జటిలమయ్యేలాగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఆయన చేసిన ట్విట్ జాతీయ స్థాయిలో సైతం వైరల్ గా మారింది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్ అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను ప్రత్యేక చట్టంతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై నేషనల్ లెవెల్ లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈ వ్యవస్థ ఏర్పాటు అనేది ఇతర మతాలకు వ్యతిరేకం కాదని కూడా పవన్ తేల్చి చెప్పారు. మరోవైపు వైసిపి హయాంలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని బయట పెట్టడంలో పవన్ సక్సెస్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ను డిఫెన్స్ లో పెట్టారు.పవన్ ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించారు. 11 రోజులు పాటు ఈ దీక్ష కొనసాగించనున్నారు. చివరి రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. దీక్షను స్వీకరించిన సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.గత ఐదేళ్లుగా తిరుమలలో అడ్డగోలు వ్యవహారాలు నడిచాయని గుర్తు చేశారు.భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా అనేక వ్యవహారాలు వైసిపి ప్రభుత్వం నడిపిందని చెప్పుకొచ్చారు. దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలన్నారు. లడ్డుప్రసాదం తయారీలో ఏదో జరుగుతోందని గతంలోనే అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సరే సరైన చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.శ్రీవాణి ట్రస్ట్ పేరిట కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగిందని పవన్ గుర్తు చేశారు.చివరకు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు వాడారని బయటపడడం దురదృష్టకరమన్నారు. తిరుమలలో ఇంత జరుగుతుంటే చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి,కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట పదివేల రూపాయలు వసూలు చేసి.. 500 రూపాయల రసీదు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. మిగతా సొమ్ము ఎటు పోయిందని నిలదీశారు. ఇంత జరిగినా జగన్ అడ్డగోలుగా సమర్ధించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సనాతన ధర్మ పరిరక్షణ పై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు.అయితే ఈ వివాదం లో జగన్ ను పూర్తి డిఫెన్స్ లో పడేశారు పవన్. జగన్ హయాంలో వైఫల్యాలను గుర్తు చేస్తూనే.. జాతీయ స్థాయిలో చర్చ జరిగే లా సనాతన ధర్మ పరిరక్షణ కోసం గళం ఎత్తారు. ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్షతో మరింత చర్చ జరిగేలా చూశారు. దీంతో వైసిపి ఆత్మ రక్షణలో పడింది.