సిరా న్యూస్;
భారత్ – అమెరికా మధ్య రక్షణ, వాణిజ్య బంధం బలపడుతోంది. అమెరికాలో భారతీయులు ఎక్కువే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అభిమానులు చాలా మంది ఉన్నారు. వీరంతా మోదీ ఎప్పుడు అమెరికా వెళ్లినా ఘన స్వాగతం పలకడమే కాదు.. ఓ భారీ ఈవెంట్ కూడా నిర్వహిస్తుంటారు. తాజాగా ప్రధాని మోదీ 3 రోజుల పర్యటనకు అమెరికాకు వెళ్లడంతో.. ప్రవాసులంతా.. వేలాదిగా తరలివచ్చారు. లాంగ్ ఐలాండ్‌లో నస్సావూ కొలీజియం స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఈ సందర్భంగా.. సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోదీ.. ఇండియా ఎలా వేగంగా అభివృద్ధి చెందుతోందో తెలిపారు.ప్రధాని మోదీ రకరకాల అంశాలపై మాట్లాడారు. భారత్-అమెరికా సంబంధాలపై ముచ్చటించారు. అమెరికాలో భారతీయుల్ని మెచ్చుకున్నారు. వారే ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్లు అని అన్నారు. వారి కారణంగానే ఇండియా-అమెరికా సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య వారధిని నిర్మించడంలో ప్రవాసుల పాత్రను మోదీ మెచ్చుకున్నారు. అందరికీ ఏఐ అంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుందన్న మోదీ.. తనకు మాత్రం ఏఐ అంటే అమెరికా-ఇండియా గుర్తొస్తాయని అన్నారు.ఈ క్రమంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కిల్లర్ డ్రోన్‌లను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బిడెన్ ఖరారు చేశారు. భారతదేశం అమెరికా నుండి ఎంక్యూ-9బి (16 స్కై గార్డియన్, 15 సీ గార్డియన్) రిమోట్‌గా పైలట్ చేసే విమాన డ్రోన్‌లను కొనుగోలు చేయబోతోంది. ఈ డ్రోన్ల ధర దాదాపు 3 బిలియన్ డాలర్లు.గత ఏడాది జూన్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికా నుండి గాలి నుండి ఉపరితల క్షిపణులు, లేజర్-గైడెడ్ బాంబులతో కూడిన ఎంక్యూ-9బి స్కై గార్డియన్, సీ గార్డియన్ సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఆమోదించింది. భారత్-అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ రోడ్‌మ్యాప్‌ను మోదీ, బిడెన్ ప్రశంసించారు. ఈ రోడ్‌మ్యాప్ కింద, భారీ పరికరాలు, జెట్ ఇంజిన్‌లు, మందుగుండు సామగ్రి, గ్రౌండ్ మొబిలిటీ సిస్టమ్‌ల వంటి ఆయుధాల తయారీని చేర్చారు. ఈ ముఖ్యమైన సహకారంలో, లిక్విడ్ రోబోటిక్స్, భారత సముద్ర రక్షణ ఇంజనీరింగ్, సముద్ర భద్రతను పెంపొందించడానికి మానవరహిత ఉపరితల వాహనాల ఉత్పత్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వనుంది.క్వాడ్ కాన్ఫరెన్స్ అనంతరం ఇరువురు నేతలూ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని చాలా పటిష్టంగా అభివర్ణించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ఇరువురు నేతలు చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో సహా ప్రపంచ, ప్రాంతీయ సమస్యలపై సమావేశంలో చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇటీవల మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ద్వైపాక్షిక సమావేశంలో చర్చ జరిగింది., యుఎస్-ఇండియా సిఇఒ ఫోరమ్‌కు కో-ఛైర్‌గా ఉన్న రెండు కంపెనీలు లాక్‌హీడ్ మార్టిన్ మరియు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మధ్య సి-130జె సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌పై టీమ్ ఒప్పందాన్ని ఇరువురు నేతలు అభినందించారు. క్వాడ్ ఎవరికీ వ్యతిరేకం కాదనీ, ఇది అంతర్జాతీయ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో వివాదాలలో నిమగ్నమై ఉన్న చైనాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమెరికాలోని డెలావేర్‌లో జరుగుతున్న క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉద్రిక్తతలు, సంఘర్షణలు చుట్టముట్టిన సమయంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. అలాంటి పరిస్థితిలో భాగస్వామ్య ప్రజాస్వామ్య విలువల ఆధారంగదా క్వాడ్‌తో కలిసి పనిచేయడం మొత్తం మానవాళికి చాలా ముఖ్యమని చెప్పారు. 2021లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షతన జరిగిన తొలి క్వాడ్ సదస్సును ప్రధాని గుర్తుచేసుకున్నారు. చాలా తక్కువ సమయంలో క్వాడ్ దేశాలు సహకారాన్ని ప్రతి దిశలో విస్తరించాయని చెప్పారు. 2025లో ఈ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు.C-130 సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నిర్వహించే భారత నౌకాదళం, గ్లోబల్ పార్టనర్‌ల సంసిద్ధతకు మద్దతుగా భారతదేశంలో కొత్త మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ సదుపాయాన్ని ఈ ఒప్పందం ఏర్పాటు చేస్తుంది. యుఎస్-ఇండియా రక్షణ, ఏరోస్పేస్ సహకారంలో ఇది ఒక ముఖ్యమైన దశ. ఇది ఇరుపక్షాల లోతైన వ్యూహాత్మక, సాంకేతిక భాగస్వామ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది.