విద్యార్థుల్లో సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందించడమే ఎన్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం

-నేడు జాతీయ సేవా పథకం దినోత్సవం

సిరా న్యూస్;
విద్యార్థి దశ నుంచే సేవా భావం, క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించేందుకు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ కళాశాలలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలోను, ప్రజలను సమాజ సేవ పట్ల చైతన్యపర్చడంలోను ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల కృషి వెల కట్టలేనిది. సమాజంలో ఉన్నవారిని చైతన్యపర్చడంతో పాటు, సమాజ సేవను తమ సేవగా భావించే భావజాలం విద్యార్థి దశ నుంచే అలవాటు చేయడం ద్వారా దేశ భవిష్యత్తుకు పునాదులు వేసినట్లవుతుంది. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే ఎన్‌ఎస్‌ఎస్‌లో వలంటీర్లుగా చేరతారు.
జాతీయ సేవా పథకం (నేషనల్ సర్వీస్ స్కీమ్ ) భారత ప్రభుత్వం చేత 1969 సంవత్సరం ప్రారంభించబడిన యువజన కార్యక్రమం.ఈ పథకాన్ని ప్రారంభించి నేటికీ 56 సంవత్సరాలు.(సెప్టెంబర్ 24 2024), ఇక దీని చరిత్రలోకి పోతే డా. డి.ఎస్. కొఠారి (1964-66) నేతృత్వంలోని విద్యా కమీషన్, విద్య అన్ని దశలలో ఉన్న విద్యార్థులను ఏదో ఒక విధమైన సామాజిక సేవతో ముడిపెట్టాలని సిఫారసు చేసింది. ఏప్రిల్ 1967 సంవత్సరంలో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి వారి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. అయితే అప్పటికే విశ్వవిద్యాలయ దశలో, స్వచ్ఛంద ప్రాతిపదికన ఉనికిలో ఉన్న నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్ సి సి) లో చేరడానికి విద్యార్థులను అనుమతించాలని, దీనికి ప్రత్యామ్నాయాన్ని నేషనల్ సర్వీస్ స్కీం (ఎన్ఎస్ఎస్) అని పిలువబడే కొత్త కార్యక్రమం రూపంలో వారికి అందించవచ్చని వారు సిఫార్సు చేశారు. 1969 సంవత్సరంలో సెప్టెంబరులో జరిగిన వైస్ చాన్సలర్స్ కాన్ఫరెన్స్ ఈ సిఫారసు ప్రకారంగా,సమస్యను వివరంగా పరిశీలించడానికి వైస్ చాన్సలర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. భారత ప్రభుత్వ విద్యపై జాతీయ విధానం ప్రకటనలో, పని అనుభవం, జాతీయ సేవ విద్యలో అంతర్భాగంగా ఉండాలని నిర్దేశించబడింది. మే, 1969 సంవత్సరంలో, విద్యా మంత్రిత్వ శాఖ, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల విద్యార్థుల ప్రతినిధుల సమావేశం కూడా ఏకగ్రీవంగా ‘జాతీయ సేవ జాతీయ సమైక్యతకు శక్తివంతమైన సాధనం కాగలదని ప్రకటించింది. పట్టణ విద్యార్థులను గ్రామీణ జీవితానికి పరిచయం చేయడానికి, తద్వారా దేశ పురోభివృద్ధికి, అభ్యున్నతికి విద్యార్థి సమాజం చేస్తున్న కృషికి చిహ్నంగా ఉంటుందని జాతీయ సేవా పథకం తీసుకరావడం జరిగింది. 1969 సెప్టెంబరు 24న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ వి.కె.ఆర్.వి.రావు 37 విశ్వవిద్యాలయాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) కార్యక్రమాన్ని ప్రారంభించి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ పథకం అమలుకు సహాయం,సహకారాన్ని అడిగిగారు.
విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించవలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధిలోనూ, ఉద్యమాలలోనూ విద్యార్థులు పాలుపంచుకుంటారు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు కానీ కల్లాకపటం తేలియని నిర్మల మనస్కులు వీరు. వీరు కూడా సంఘజీవులే, సంఘంలో భాగస్వాములే, కాబట్టి సంఘసేవ (సోషల్ సర్వీస్) వాళ్ళకి బాధ్యత ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలున్నాయి.
ఒక మనిషి మరొక మనిషికి సహకరించడం మానవతా లక్షణం. అదేవిధంగా మనం పదిమందిలో ఉన్నప్పుడు మనవల్ల ఆ పదిమందికీ ప్రయోజనం వుండాలి- లేదా మనవల్ల మరొకరికి మేలు కలగాలి. ఆ విధంగా పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సంఘసేవ.
విద్యార్థుల్లో సామాజిక సేవా స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే అవకాశాన్ని కల్పించడం ఎన్‌ఎస్‌ఎస్ ప్రధాన లక్ష్యం. విద్యార్థుల్లో స్వచ్ఛంద సేవను ప్రోత్సహించేందుకు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఎన్ఎస్ఎస్ కార్యక్రమం రెండు భాగాలుగా విభజించబడింది: సాధారణ కార్యకలాపాలు మరియు ప్రత్యేక క్యాంపింగ్ కార్యక్రమాలు. సాధారణ కార్యకలాపాలలో వారంవారీ సమావేశాలు, సమాజ సేవ, సామాజిక సేవా ప్రాజెక్ట్‌లు ఉంటాయి. ప్రత్యేక క్యాంపింగ్ కార్యక్రమాలు సాధారణంగా 7 రోజుల పాటు నిర్వహించబడతాయి, ఈ సమయంలో విద్యార్థులు శుభ్రపరచడం, మొక్కల పెంపకం మరియు ఆరోగ్యం, పారిశుద్ధ్య కార్యక్రమాల వంటి సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కళాశాలను పరిశుభ్రంగా వుంచటం- తోటలు పెంచటం- రోడ్లు వెయ్యటం. పరిసర గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామంలో రోడ్లు వేయటం, మురికి వాడలను శుభ్రపరచడం, నిరక్షరాస్యులకి విద్య బోధించడం. ఆరోగ్య సూత్రాలను, వయోజన విద్య ఆవశ్యకతను, జనాభా సమస్య నివారణను ప్రజలకు తెలియజేయడం. వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమదాలలోనూ సహాయం చేయడం. ధనవంతుల నుండి విరాళాలు సేకరించి బీదవారికి, అనాథలకు సహాయపడటం. పొదుపు ఆవస్యకతను, అంటు వ్యాధుల వల్ల వచ్చే అరిష్టాలను అరికట్టే విధానాలను ప్రచారం చేయడం దీని ముఖ్య లక్షణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *