నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు NHI 167K భాదిత రైతుల ధర్నా

gb444భూముల నష్టపరిహారం పెంచకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తాం
భూములకు తక్కువ ధర చెల్లించి రైతులకు అన్యాయం చేస్తున్నా ఎం. పి. ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం భాదిస్తోంది
భాదిత రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి.

 సిరా న్యూస్, నంద్యాల;
కల్వకుర్తి – నంద్యాల 167K జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన భాదిత రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం బయటి మార్కెట్ ధరలో సగంకూడా రైతులకు అందడం లేదని , అధికారుల ఏకపక్ష ధోరణి వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని నంద్యాల మండలం పెద్ద కొట్టాల మాజీ సర్పంచ్ పి. జయ పాపిరెడ్డి, భాధిత రైతులు మహేష్ నాయుడు, బిళ్ళలాపురం రైతు లు శ్రీరాములు, గడ్డం మోహన్ కృష్ణ, కోటేశ్వరరావు, కొత్తపల్లి రైతులు భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ముందు వందలాదిమంది భాదిత రైతులు ధర్నా చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి – నంద్యాల 167K జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ రైతులకు శాపంగా మారిందని, రైతుల ప్రమేయం లేకుండా జాతీయ రహదారి నిర్మాణం కోసం భూములు తీసుకుంటున్నారని వారు ఆరోపించారు. కనీసం గ్రామ సభలు పెట్టి భాదిత రైతులతో మాట్లాడే తీరిక, ఓపిక రెవిన్యూ, జాతీయ రహదారి అధికారులకు లేదని, వారే మా పొలం ధర నిర్ణయించి బ్యాంకులో డబ్బులు జమచేస్తాం తీసుకొండని భాదిత రైతులకు నోటీసులు ఇవ్వడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రం నంద్యాల పట్టణానికి కేవలం రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే మా విలువైన భూములు 167 K జాతీయ రహదారి నిర్మాణంలో పోతున్నాయని, ఎకరం పొలం బయటి మార్కెట్ లో రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల విలువ ఉందని, ప్రభుత్వం మాత్రం మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు మూడు, ఆరు లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇస్తున్నామని నోటీసులు ఇవ్వడం ఎంత వరకు న్యాయం అని రైతులు నిలదీసారు.
రైతులకు ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తున్నా ఎం. పి. ఎమ్మెల్యేలు మౌనంగా ఉండడం భాదిస్తుందన్నారు. మాకు సరైన నష్ట పరిహారం చెల్లించకుంటే న్యాయస్థానం ఆశ్రయిస్తామని భాదిత రైతులు హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *