సిరా న్యూస్,అమరావతి;
కోవిడ్ కొత్త వేరియంట్ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన అవసరం లేదు.ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వెల్లడించారు. డెల్టా వేరియంట్ తరహా లక్షణాలు లేవు. అయితే జేఎన్–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని వివరించారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు.
పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నాం. కొత్త వేరియంట్లను గుర్తించడానికి ఈ పరీక్షలు దోహదం చేస్తున్నాయని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ పెడుతున్నాం.అలాగే ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధంచేస్తున్నామని వెల్లడించారు.సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ ఈ వేరియంట్ వల్ల ఆందోళన అనవసరమని వైద్యులు చెప్తున్నారు .ముందస్తు చర్యల పట్ల దృష్టిపెట్టాలి. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్ క్లినిక్ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్ చేయాలి. కొత్తవేరియంట్ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్ క్లినిక్స్ స్టాఫ్కు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.