సిర్యానూస్, భీమదేవరపల్లి
వీరభద్రుడి భూములకు రక్షణ కరువు: బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్
* కబ్జాకు గురవుతున్న ఆలయ భూములు
* చోద్యం చూస్తున్న దేవదాయ శాఖ అధికారులు
* భూముల సర్వే చేపట్టాలి
ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ భూములు కబ్జాకు గురై అన్యక్రాంతమవుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి 22 ఎకరాల 39 గుంటల భూమి ఉందని, దేవుని భూములు సర్వే చేపట్టకపోవడం వల్ల కాలక్రమమైన భూములు తగ్గుతూ వస్తున్నాయని స్పష్టం చేశారు. 2019లో దేవాదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించలేదని అన్నారు. దీంతో దేవాలయానికి చెందిన భూములపై అక్రమార్కులు కన్ను వేసి అందిన కాడికి కబ్జా చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఆలయ చైర్మన్ పదవీకాలం పూర్తి అయిన మూడు రోజులకే స్థానికంగా ఉండే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఆలయానికి చెందిన భూమిలో ప్రహరీ గోడ నిర్మాణం చేశారని, చైర్మన్ పదవి కాలం పూర్తయిన వెంటనే పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం హడావిడిగా పూర్తి చేయడం వెనక ఆంతర్యం ఏముందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇదంతా దేవాదాయ శాఖ అధికారులకు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఆలయానికి చెందిన భూముల సర్వే చేపట్టి వాటికి హద్దులు నిర్ణయించాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. లేనిచో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.