సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే పై జనాభిప్రాయం వింతగా కనిపిస్తుంది. సమగ్ర సర్వే పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. సర్వే వల్ల తమకు ఉపయోగం ఏంటన్న ప్రశ్న కుటుంబాల నుంచి ఎదురవుతుంది. ప్రభుత్వ పథకాలు ఇస్తారంటే ప్రజలు ఆసక్తిని సాధారణంగా కనపరుస్తారు. కానీ ఉత్తుత్తి సర్వే వల్ల తమకు ప్రయోజనకరమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకీ ఉపయోగం లేని సర్వేలంటూ ప్రజలు అక్కడక్కడా సిబ్బందిపై తిరగబడుతున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్నారు ప్రభుత్వ సిబ్బంది. ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నివాస ప్రాంతాలను సిబ్బంది గుర్తించారు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేశారు. మూడు రోజుల పాటు స్టిక్కర్లు వేసే కార్యక్రమం జరిగింది. ఎన్యుమరేటర్లుగా ఉపాధ్యాయులు వస్తుండటం దాదాపు యాభై ప్రశ్నలకు పైగానే వేస్తూ సమాధానాలు చెప్పమని అడుగుతుండటంతో కొంత విసుగుకు ప్రజలు లోనవుతున్నారు. ఒక్కో కుటుంబం వద్ద గంట సేపు ప్రశ్నలకే పడుతుండటంతో వారు కొన్నింటికి సమాధానం చెప్పలేక మరికొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సమగ్ర సర్వే ఎందుకు జరుగుతుందన్నది ప్రజలకు ఎన్యుమరేటర్లు వివరించలేకపోతున్నారు. దీంతో ఎందుకొచ్చిన సర్వే అంటూ వారు విసుగు చెంది ఏదో సిబ్బంది అడిగిన ప్రశ్నలకు కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చి మిగిలిన వాటికి దాటవేస్తున్నట్లు తెలిసింది. సమగ్ర సర్వే వల్ల బీసీలకు మాత్రమే ప్రయోజనం అన్న టాక్ బాగా పడిపోయింది. సర్వే వల్ల తమకు గతం నుంచి అందుతున్న పథకాలు రాకుండా ఎక్కడ పోతాయోనన్న ఆందోళన కూడా ప్రజల్లో ఉంది. ఆధార్ కార్డు నెంబరు ఇచ్చేందుకు కూడా కొందరు ఇష్టపడటం లేదు. ఇక తమ ఆదాయం విషయంలో కూడా స్పష్టత రాకుండా పోయింది. ఆదాయం తమకు వచ్చేది చెబితే ప్రభుత్వ పథకాలు అందవేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే కొన్ని పథకాలు అందకుండా పోయాయి. దీంతో తమ పూర్తి వివరాలను అందించేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. దీంతో అసలు ప్రభుత్వ ఆలోచన నెరవేరుతుందా? ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? అన్న సందేహం నెలకొంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే తమకు ఉన్న పొలం వివరాలను కూడా సక్రమంగా చెప్పడం లేదు. ఎన్ని ఎకరాలుంటే రైతు భరోసా ఇస్తుందో ఏ ప్రభుత్వం అని సందేహం పట్టిపీడుస్తుండటంతో తమకు ఎన్ని ఎకరాలున్నదీ ఎన్యుమరేటర్లకు చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఇక సొంత ఇల్లు విషయంలోనూ అసలు నిజం చెప్పకుండా కొందరు దాచేస్తున్నారు. మరికొందరు మాత్రం తమ కొడుకు పేరు, కుమార్తెల పేర్ల మీద ఇల్లు ఉందని చెబుతూ తప్పించుకుంటున్నారు. అందుకే తమ వ్యక్తిగత వివరాలను చెప్పడానికి ఇష్టపడకపోవడంతో ఈ సర్వే అసలు లక్ష్యం నెరవేరే అవకాశం లేదన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తుంది.
స్వాగతించిన కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కులగణనను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కులగణను స్వాగతిస్తున్నామని పాజిటివ్ గా మాట్లాడుతూనే రాజకీయ, ఆర్థిక నేపథ్యంపై ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తైందని, బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసిందని తెలిపారు. కొత్త హామీలు దేవుడెరుగు కానీ ఉన్నవాటిని కూడా రద్దు చేశారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసిందని, వెనుకబడిన వర్గాలకు వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు. చేతి గుర్తుకు ఓటేస్తే, చేతివృత్తులవారి గొంతు కోసిందని మండిపడ్డారు. ఇప్పుడు బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో నాటకం ఆడుతోందని ఆరోపించారు. సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారని అన్నారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని పొంగులేటి అంటున్నారని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. రూ.3 లక్షల బీసీల ఫీజు రీ అంబర్స్మెంట్, బీసీ గురుకులాలు, బీసీ డిగ్రీ కళాశాలలు ఎటు పోయాయని అడిగారు.చేసిన మోసానికి రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిపై తమకు అనుమానాలు ఉన్నాయని, 60 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీసీలకు ఒరగబెట్టింది ఏమి లేదని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పై బీసీలను చైతన్యం చేస్తామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిక్లరేషన్ లపై వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేల పై దాడి చేస్తున్నారని, దమ్ముంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పారు. సిగ్గు ఎగ్గు, నీతి, లేకుండా రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడాడని మండిపడ్డారు. మహారాష్ట్రకు వెళ్లి చేయని పనులు, చేసినట్లు చెప్పారని విమర్శించారు. రైతులకు 500 బోనస్ ఇచ్చినట్లు మహారాష్ట్రలో చెప్పారని, అది నిరూపిస్తే తాము రాజీనామా చేస్తామన్నారు. 420 హామీలు, 6 గ్యరెంటీలు అమలు చేసేదాకా వెంటపడతామని హెచ్చరించారు.