సిరా న్యూస్;
–నేడు ఆయన పుట్టిన రోజు
పది వేల కోట్ల రూపాయలుగా ఉండవలిసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడు ఒకే ఒక్కడు తన యుక్తి తో,తన వ్యాపార నిపుణతతో ఆరు లక్షల కోట్లకు ఎగబాకేలా చేసాడు. దాదాపు ఏడు లక్షల మందికి ఉపాధినిస్తూ,నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ను అందనంత ఎత్తులో నిలబడేలా చేసాడు. నేడు ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రక్కుల వరకు ఇలా ప్రతి వ్యాపారంలో లోను ఖచ్చితంగా టాటా పేరు వినిపిస్తుంది.ఇంతటి ఘన చరిత్రను టాటా గ్రూప్ కు కట్టబెట్టేలా చేసాడు అతను. అతనే రతన్ టాటా. కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శప్రాయడు ఈ జీవన విజేత. రతన్ టాటా గురించి చూసుకుందాం:1937 డిసెంబర్ 28 న దేశంలోనే ధనిక కుటుంబంలో జన్మించాడు రతన్ టాటా. ఏడేళ్ల వయసులోనే తల్లి తండ్రులిద్దరూ విడిపోవటంతో నాయనమ్మ దగ్గర పెరగవలిసి వచ్చింది. తన చదువును అమెరికాలోనే పూర్తి చేసుకొని ఆర్జెడి టాటా పిలుపు మేరకు జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటీస్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు రతన్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో, తన నైపుణ్యంతో టాటా కంపెనీలో ఒక ఉత్తమ ఉద్యోగిగా ఎదిగగలిగాడు రతన్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేసిన తరువాత 1991 లో ఆర్జెడి టాటా నుండి టాటా గ్రూప్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించాడు రతన్. అప్పట్లో ఈ నిర్ణయాన్ని బోర్డు అఫ్ మెంబెర్స్ లో చాలా మంది వ్యతిరేకించారు. అనుభవం లేని రతన్ చేతిలో ఇన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యం నడవలేదని అందరు వాదించారు. కానీ వారికి ఆనాడు తెలియదు పాపం ఇతడే టాటా గ్రూప్ ను దశదిశలా వ్యాపించే ఘనుడు అవుతాడని… చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత టాటా గ్రూప్ లో సమూల ప్రక్షాళన చేసాడు రతన్. రాత్రి పగలు కష్టపడి పది వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని తన అసాధారణ వ్యాపార నైపుణ్యంతో ఆరు లక్షల కోట్ల విలువ చేసే కంపెనీగా మార్చాడు రతన్. దేశ వాణిజ్య , పారిశ్రామిక పురోగతిలో కీలక పాత్ర పోషించాడు. నేడు టాటా గ్రూప్ 90 కి పైగా దేశాలలో విస్తరించి వందకు పైగా వ్యాపారాలలో తన ముద్రను వేసి, దేశంలోనే కాదు, ప్రపంచం లోనే అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా నిలబడింది. వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరంగా ఎదగగలిగింది.ప్రతి మధ్య తరగతి వాడికి సొంతంగా ఒక కారు ఉండాలనే ఉద్దేశంతో కేవలం లక్ష రూపాయలకే టాటా నానో కారును మార్కెట్లోకి తెచ్చి పెను సంచలనాన్నే సృష్టించాడు రతన్.. నానో కారు ఓ సంచలనం: టాటా గ్రూప్ భారత దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. నేడు ఎయిర్ ఇండియా గా పిలబడుతున్న విమానయాన సంస్థను మొదట టాటాఎయిర్ లైన్స్ పేరుతో 1868 లో జంషెడ్ జీ టాటా స్థాపించాడు.
దేశ సామజిక పరిస్థితులు మెరుగుపరచటానికి టాటా ట్రస్టులు ఎంతగానో కృషి చేస్తున్నాయి.తాజ్ ఉగ్ర దాడిలో నష్టపోయిన వారికి అన్ని విధాలా సహాయమందించాడు రతన్. బ్రహ్మచారి గా ఉంటూ నలుగురి బాగు కోసం బతుకుతున్న మహనీయుడు రతన్ టాటా. తన ప్రతిభను మెచ్చి పలు దేశాలలోని యూనివర్సిటీలు తనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. అంతే కాదు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో రతన్ ను గౌరవించింది. కోట్లకు అధిపతి అయినా ఏనాడూ కుసుమంత గర్వాన్ని కూడా ప్రదర్శించలేదు రతన్ టాటా. 84ఏళ్ళ వయసులోనూ సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు రతన్.నేడు రతన్ టాటా అంటే ఒక వ్యక్తి కాదు,ఒక సంస్థ , ఒక బ్రాండ్. వీటన్నిటికీ మించి సృజనాత్మకత , దార్శనికత ఉన్న ఒక గొప్ప మానవతావాది. నేడు 130 కోట్ల మంది భారతీయులు మనసారా సగర్వంగా ఇతడు మా భారతీయుడు అని చెప్పుకునే వారిలో ముందు వరుసలో ఉంటాడు రతన్ టాటా. అతని సాగించిన జీవన ప్రయాణం నేడు మనందరికీ స్ఫూర్తిదాయకం.