రీఎంబర్సుమెంటు వెంటనే మంజూరు చేయాలి

కలెక్టరేట్ ను ముట్టడించిన బిజెవైఎం నాయకులు

సిరా న్యూస్,పెద్దపల్లి ప్రతినిధి:
పెండింగులో ఉన్న ఫీజు రీఎంబర్సుమెంటు, స్కాలరుషిప్పులు ఇవ్వకుండా విద్యార్థులకు నరకం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ భరతం పడతామని భారతీయ జనతా యువమోర్చా నాయకులు స్పష్టం చేసారు. విద్యార్థులకు బకాయిలు ఉన్న రూ.7వేల5వందల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యువమోర్చా నాయకులు కలెక్టరేటును ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ మాట్లాడుతు, అబద్దాలతో కాలం వెల్లదీస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడలు వంచి విద్యార్థులకు న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పేద విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారిందని మండిపడ్డారు. ఫీజు రీఎంబర్సుమెంటు, స్కాలరుషిప్పులు పేద విద్యార్థులకు సంజీవనితో సమానమని, వాటిని విడుదల చేయకపోవడం విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రగా ప్రభుత్వం పాటుపడుతున్నట్లు తాము భావిస్తున్నమని అన్నారు. ఫీజులు చెల్లిస్తే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఫీజు రీఎంబర్సుమెంటు బకాయిలు చెల్లిస్తే తప్పా కళాశాలలు నడపలేని స్థితికు చేరుకున్నాయని వివరించారు. చిత్తశుదిలేని కాంగ్రెస్ నాయకుల పరిపాలన వలన విద్యార్థులు బలయ్యే పరిస్థితి దాపురించిందని అసహనం వ్యక్తం చేశారు. విద్యాలయాలను, విద్యావ్యవస్థను పటిష్ట పర్చాల్సిన ప్రభుత్వం విద్యను అంధకారంలోకి నెట్టి, నూతనంగా ఇంటర్నేషనల్ పాఠశాలలు, యూనివర్సిటీలంటూ కొత్త హామీలతో చేతులు దులుపుకుంటుందని ధ్వజమెత్తారు. సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టులేదని ఎద్దేవా చేశారు. పెండింగులో ఉన్న ఫీజు రీఎంబర్సుమెంటు, స్కాలరుషిప్పులను వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో బిజెవైఎం ఆద్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సతీష్ హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టరు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో దళితమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె సదానందం, నాయకులు అభినయ్, రామగిరి అఖిల్, నరేష్, జంగా చక్రధర్ రెడ్డి, క్రాంతి, సందీప్, కృష్ణ, సంతోష్, విజయ్, వెంకటేష్, ఆకాష్, రిషికేష్ అధిక సంఖ్యలో యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *