ఇంటికే ఆర్టీసీ కార్గో సర్వీసులు

సిరా న్యూస్,నల్గోండ;
: మీరు హైదరాబాద్ లో ఉన్నారా.. అయితే టీజీఎస్ఆర్టీసీ కొత్త తరహా సేవలు మీ ముందుకు తెస్తోంది. ఇప్పటి వరకు ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ అందజేస్తున్న టీజీఎస్ఆర్టీసీ, పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా మీ ఇంటికే పార్శిల్ సర్వీస్ ను డెలివరీ చేయనుంది. ఈ సేవలు కూడా రేపటి నుండే ప్రారంభం కానున్నాయి. మీ ఇంటి నుండి కాలు బయటకు పెట్టకుండా, తెలంగాణ ఆర్టీసీ సంస్థ కార్గో సర్వీస్ పరంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ టీజీఎస్ఆర్టీసీ విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, టీజీఎస్ఆర్టీసీ బస్సులను పెంచి ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంది. అలాగే ఆర్టీసీ సంస్థ కార్గో సేవలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఏదైనా పార్శిల్ చేస్తే, సంబంధిత వ్యక్తి కార్గో సర్వీస్ వద్దకు వెళ్లి పార్శిల్ పొందాలి. కానీ ఇప్పుడు ఆ పద్దతికి స్వస్తి పలికేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్ట్ పూర్తి అడ్రస్ రాస్తే చాలు.. హైదరాబాద్ వాసుల ఇంటికే పార్శిల్స్ డెలివరీ కానున్నాయి. ఈ సర్వీస్ ను అమలు చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా టీజీఎస్ఆర్టీసీ గుర్తించింది.టీజీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను లాజిస్టిక్స్ కార్గో సేవ‌ల‌ను మ‌రింత‌గా విస్తరిస్తోంద‌ని ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. హైద‌రాబాద్ లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నామన్నారు. హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుండి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని, టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్కడికైనా హోం డెలివ‌రీ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని, ప్రజ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని, వినియోగ‌దారుల‌ను మంత్రి కోరారు.టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టనున్న కార్గో హోమ్ డెలివరీ సేవలకు సంబంధించి చెల్లించాల్సిన ధరలను కూడా మంత్రి పొన్నం ప్రకటించారు. 0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50, 1.01నుంచి 5 కేజీల‌కు రూ.60, 5.01 నుంచి 10 కేజీల‌కు రూ.65, 10.1 నుంచి 20 కేజీల‌కు రూ.70, 20.1 నుంచి 30 కేజీల‌కు రూ.75, 30.1 కేజీలు దాటితే.. స్లాబ్ ల ఆధారంగా ధరలు ఉంటాయన్నారు. హైదరాబాద్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసుకొని, ప్రారంభిస్తున్న టీజీఎస్ఆర్టీసీ హోమ్ డెలివరీ సర్వీసులను ఆదరించాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. మరెందుకు ఆలస్యం.. గడప దాటకుండా మీ చెంతకు పార్శిల్ వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోకండి సుమా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *