ఆదాయంలో నాలుగో స్థానంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

సిరా న్యూస్,హైదరాబాద్;
భారతీయ రైల్వే దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ కోట్లాది మందిని తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తుంది. ప్రపంచంలోనే ఇండియన్ రైల్వేస్‌ది ప్రత్యేక స్థానం. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది సైతం రైల్వే స్టేషన్ల ఆదాయాన్ని రైల్వే శాఖ వెల్లడించింది. 2023 – 24 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఎక్కువ ఆదాయం పొందిన 100 రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమబెంగాల్‌లోని హౌరా స్టేషన్ రెండో స్థానం, చెన్నైలోని ఎంజీఆర్ సెంట్రల్ మూడో స్థానం, తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. భారతీయ రైల్వేకు ఏటా ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రూ.3,337 కోట్ల ఆదాయం వస్తుండగా టాప్‌లో నిలిచింది. హౌరా రైల్వే స్టేషన్‌కు రూ.1,692 కోట్ల వార్షిక ఆదాయం రాగా.. చెన్నై సెంట్రల్‌కు రూ.1,299 కోట్లు వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూ.1,276 కోట్లు అర్జించింది. అలాగే, రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్న రైల్వే స్టేషన్లు నాన్ సబర్బన్ గ్రూప్ 1 కేటగిరీ కింద చేర్చారు. ఈ జాబితాలో మొత్తం 28 స్టేషన్లు స్థానం దక్కించుకున్నాయి.అటు, ప్రయాణికుల సంఖ్యా పరంగా చూస్తే ముంబైలోని థానే రైల్వే స్టేషన్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో 93.06 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ గుండా ప్రయాణించారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ రెండో స్థానంలో నిలిచింది. ఏటా ఇక్కడి నుంచి 83.79 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 39.36 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తర్వాత ఎన్ఎస్‌జీ 1 హోదా విజయవాడ మాత్రమే సాధించింది. ఈ గుర్తింపుతో కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్లకు మరిన్ని నిధులు కేటాయించనుంది. ప్రయాణికులకు సైతం ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆదాయం పూర్తి వివరాలు
న్యూఢిల్లీ – రూ.3,337 కోట్లు
హౌరా (వెస్ట్ బెంగాల్) – రూ.1,692 కోట్లు
చెన్నై సెంట్రల్ (తమిళనాడు) – రూ.1,299 కోట్లు
సికింద్రాబాద్ (తెలంగాణ) – రూ.1,276 కోట్లు
హజరత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) – రూ.1,227 కోట్లు
లోకమాన్య తిలక్ టెర్మినల్ (ముంబై) – రూ.1,036 కోట్లు
అహ్మదాబాద్ (గుజరాత్) – రూ.1,010 కోట్లు
ముంబై సీఎస్‌టీ (మహారాష్ట్ర) – రూ.982 కోట్లు
ప్రయాణికుల సంఖ్యాపరంగా చూస్తే..
న్యూఢిల్లీ – 39,362,272
హౌరా (వెస్ట్ బెంగాల్) – 61,329,319
చెన్నై సెంట్రల్ (తమిళనాడు) – 30,599,837
సికింద్రాబాద్ (తెలంగాణ) – 27,776,937
హజరత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) – 14,537,686
లోకమాన్య తిలక్ టెర్మినల్ (ముంబై) – 14,680,379
అహ్మదాబాద్ (గుజరాత్) – 18,260,021
ముంబై సీఎస్‌టీ (మహారాష్ట్ర) – 51,652,230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *