సిరా న్యూస్;
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మూడు రోజుల కిందట చేపట్టిన మంత్రివర్గ విస్తరణపై ఆ రాష్ట్రంలోనూ, బయటా పెద్దయెత్తున చర్చ సాగుతోంది. ఐదేళ్ల క్రితమే రాజకీయరంగ ప్రవేశం చేసిన ఉదయనిధికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం, మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి, బెయిల్‌పై తిరిగి వచ్చిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి మళ్లీ కీలకమైన శాఖలు అప్పగిస్తూ మంత్రివర్గంలోకి తీసుకోవడం ఈ రెండు నిర్ణయాలూ తమిళనాట అగ్గిరాజేస్తున్నాయి.1949లో అన్నాదురై ప్రారంభించిన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ వజ్రోత్సవ సంవత్సరంలోకి అడుగిడిన తరుణంలో చోటుచేసుకున్న ఈ తాజా పరిణామాల పట్ల పార్టీలోనూ అసంతృప్తులు లేకపోలేదు. కాకపోతే అగ్రనేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు భయపడి ఎవరూ పెదవి విప్పడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడిఎంకె తన ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె పతనానికి ముందస్తు సూచికగా ఉదయనిధి నియామకాన్ని అభివర్ణించింది. నలభైఆరేళ్ల ఉదయనిధి పార్టీలో తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ, ముందుగా ఉప ముఖ్యమంత్రి పదవిని అంది పుచ్చుకున్నారు. ఎంకె స్టాలిన్ సైతం ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం సొంతం చేసుకున్న అనంతరమే ఆయనకు కరుణానిధి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు.ఉదయనిధి విషయంలో స్టాలిన్ అంత సమయం తీసుకోలేదు. సినిమాల్లో హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే కుమారుడి చేత రాజకీయ అరంగేట్రం చేయించారు. 2021 ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా గెలిచిన తనయుడికి ఆ మరుసటి సంవత్సరమే యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రిని, తాజాగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి, కుటుంబ వారసత్వ రాజకీయాల పునాదులను పటిష్టం చేస్తున్నారు. సెంథిల్ బాలాజీ విషయానికొస్తే, అన్నాడిఎంకె ప్రభుత్వం లో రవాణా మంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఉద్యోగ నియామకాల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై కేసు నమోదైంది. 2021లో సెంథిల్ డిఎంకెలో చేరి, కరూర్ నియోజకవర్గంనుంచి గెలిచి విద్యుత్ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది జూన్ నెలలో ఇడి అధికారులు దాడులు నిర్వహించి, సెంథిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత పదహారు నెలలుగా జైలులోనే ఉన్న సెంథిల్‌కు సుప్రీం కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది.అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టయి, జైలుకు వెళ్లొచ్చిన సెంథిల్‌కు బెయిల్ రావడమే పరమానందంగా, అది తాము సాధించిన విజయంగా డిఎంకె నేతలు భావించడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో అడుగు ముందుకేసి, సెంథిల్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుని, కీలకమైన పోర్టుఫోలియోలు అప్పగించారు. సెంథిల్ మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే పేరు గడించారు. ఆయనపై గతంలోనూ ఎన్నో కేసులు నమోదయ్యాయి. అయినా స్టాలిన్ ఆయనకు మంత్రిపదవి కట్టబెట్టడంతో పార్టీలో అసంతృప్తి రాజుకుంటోంది. మన దేశంలో కుటుంబ వారసత్వ రాజకీయాలకు, ప్రాంతీయ పార్టీలకూ మధ్య అవినాభావ సంబంధం ఉంది. సమాజ్ వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్, తెలుగుదేశం.. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలు వారసులకు పగ్గాలు అప్పగించడం చూస్తూనే ఉన్నాం. డిఎంకె సైతం ఇందుకు ఏమాత్రం తీసిపోలేదనడానికి ప్రస్తుత పరిణామాలే సాక్ష్యం. మరో రెండేళ్లలో, 2026లో తమిళనాడుకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా డిఎంకెలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు పార్టీకి కీడు చేసే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేసిన ప్రముఖ సినీ నటుడు, హీరో విజయ్ నుంచి ప్రధాన పార్టీలైన డిఎంకె, అన్నాడిఎంకెలకు గట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఆయన వచ్చే ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లోనూ డిఎంకె తరఫున ప్రచార బాధ్యతలు నిర్వహించిన ఉదయనిధికి, ఉప ముఖ్యమంత్రి హోదాలో రాగల అసెంబ్లీ ఎన్నికలను, విజయ్ ప్రభంజనాన్నీ ఎదుర్కోవడం కతి మీద సామే. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశం యావత్తు దృష్టినీ ఆకర్షించడం మినహా, ఇంత వరకూ మంత్రిగా సాధించినదేమీ లేదన్న విమర్శకుల నోళ్లను ఉదయనిధి ఎలా మూయిస్తారో వేచిచూడాల్సిందే.