ఎస్ ఈ సీ రేసులో ఆ నలుగురు..?

సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కమిషనర్ పార్థసారధి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఆయనను మరో ఏడాది కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్నది వేచి చూడాలి. కొత్త కమిషనర్ నియామకానికి విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఎస్ఈసీ నియామకం కీలకం కానుంది.రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారిధి పదవీకాలం ముగియటంతో కొత్త ఎన్నికల కమీషనర్ నియమించాలని భావిస్తోంది సర్కార్. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్న చర్చ సెక్రటెరియట్ బ్యూరోక్రాట్స్‌లో జోరుగా సాగుతోంది. ఈ పదవికి రిటైర్డు ఐఏఎస్ అధికారిని నియమించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి జరుగుతుంది. ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పని చేసి ఉండాలనేది నిబంధన.1994 లో రూపొందించిన సర్వీసు రూల్స్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం కనీసం 5 ఏళ్లు.. గతంలో కమిషనర్లుగా పని చేసిన కాశీ పాండ్యన్, ఏవీఎస్ రెడ్డి, కాకి మాధవరావు, రమాకాంత్ రెడ్డి, నాగిరెడ్డి లాంటి వాళ్లు ఆ పదవిలో పూర్తికాలం అంటే ఐదేళ్లపాటు కొనసాగారు. కాగా, అప్పటి ప్రభుత్వాలు కూడా రూల్స్ కు లోబడి అందరూ ఐదేళ్లు విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చాయి. ఐతే, ఒక్క పార్థసారథి విషయంలో అలా జరగలేదు. 2020 లో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో పదవీవిరమణ చేశాక, అప్పటి ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించింది. గతానికి భిన్నంగా ఆయన ఆ హోదాలో మూడేళ్ల పాటు కొనసాగుతారని ఆదేశాలు జారీ చేసింది.అందుకు అనుగుణంగా ఎస్ఈసీ కమిషనర్‌గా పార్థసారథి పదవీకాలం 2023 సెప్టెంబర్ 8తో పూర్తైంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పార్థసారధి పదవీ కాలాన్ని అప్పట్లో ఏడాది పాటు పొడిగించింది … పొడిగించిన పదవీకాలం కూడా ముగిసింది.. 2020 సెప్టెంబర్ 9 నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న పార్థసారధి గత నాలుగేళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగారు. మరో ఏడాది పాటు కమిషనర్‌గా కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. పార్థసారథి పదవీకాలం పొడగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.ఎస్‌ఈసీగా పనిచేసిన అధికారి ఒక టర్మ్ లో గ్రామ పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీలకు.. అంటే 5 రకాల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే స్ఫూర్తితో 1994 లో ప్రభుత్వం కమిషనర్ పదవీకాలాన్ని ఐదేళ్లుగా నిర్ణయించిందని మాజీ ఈసీలు అభిప్రాయపడుతున్నారు. పార్థసారథి ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో ఈ ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఆయన పదవీకాలం మరో ఏడాది పొడిగించే అవకాశం ఉందంటున్నారు.ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో పార్థసారథి ఎలక్షన్ కమిషన్ ఆఫీసు వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎస్ఈసీ కొత్త కమిషనర్ గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్న చర్చ అధికారవర్గాల్లో జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్టు కీలకంగా మారింది. ఇందుకోసం అనేక మంది రిటైర్డు అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయంటున్నారు.చిరంజీవులు, జగదీశ్వర్, జగన్ మోహన్, ఆర్వీ చంద్రవదన్, శశిధర్ లాంటి వారి పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయంటున్నారు. తెలంగాణా క్యాడర్ కు చెందిన వీళ్లంతా గతంలో ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వర్తించిన వాళ్లే.. కాగా, వీళ్ళతో పాటు ఈ మధ్యే పదవీ విరమణ చేసిన మరికొందరు అధికారులు కూడా ఉన్నా, వాళ్లకు ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అలాంటి వాళ్లలో రాణి కుముదిని, అధర్ సిన్హా, రజత్ కుమార్, సోమేష్ కుమార్, సునీల్ శర్మ, నిర్మల ఉన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల కోసం తెలంగాణాకు సంబంధించిన ఆఫీసర్ ఉంటే మంచిదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తూ, వచ్చే సంవత్సరం రిటైరయ్యే అధికారుల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వాళ్లలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు ముందు వరుసలో కనిపిస్తున్నారు. వీళ్లలో ఒకరికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పంపాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ శాంతి కుమారిని అక్కడికి పంపితే, రామకృష్ణా రావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభిస్తుందంటున్నారు.. అలాకాక తెలంగాణా ఆఫీసర్ ను ఎస్ఈసీకి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తే రామకృష్ణా రావుకు కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ముసాయిదా దస్త్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపినట్లు తెలుస్తోంది.మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక అధికారి పేరును ఖరారు చేసి ఆ ఫైల్లో రాసి తిరిగి పీఆర్ అండ్ ఆర్డీ శాఖకు పంపితే క్యాబినెట్ ఆమోదంతో ఆ ఫైల్ రాజ్ భవన్ కు వెళ్తుంది. రాజ్యాంగపరమైన పదవి కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్థసారథికి ఆ పదవిలో మరో ఏడాది కొనసాగే అర్హత ఉండటంతో.. ప్రభుత్వం ఆయన్నే కొనసాగిస్తుందా..? లేక మరో అధికారిని నియమిస్తుందా? అన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *