ఎవరికి వారే… యమునా తీరే

కమలంలో అందరూ అంతేనా

 సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో బీజేపీ ఇద్దరు కేంద్రమంత్రులు సహా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యుడితో.. గతానికి ఇప్పటికి బలంగా ఉన్నాం..లీడర్లు పార్టీని పరుగులు పెట్టిస్తారని భావించింది క్యాడర్. అయితే తామొకటి తలిస్తే..కీలక నేతలు మరొకటి చేస్తున్నారని క్యాడర్‌ గుసగుసలు పెట్టుకుంటున్నారట.తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లలో ఒకరిద్దరు తప్ప అందరూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్నవారే. వీరంతా కలిసికట్టుగా పనిచేసిన, వ్యక్తిగతంగా పనిచేసిన ప్రజలను తమ వైపు ఆకర్శించదగ్గ నేతలే. కానీ ఏ ఇద్దరు ప్రజాప్రతినిధులు కలిసినా పార్టీలో గ్రూపు తగాదాలు సమిసిపోయాయన్న ప్రచారం జరుగుతుంది.అంటే నేతల మధ్య గ్యాప్ ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని క్యాడర్ గుస్సా మీదున్నట్లు తెలుస్తోంది. ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో రెండు గ్రూపులు ఉన్నాయని, ఎంపీలలో కూడా అదే పరిస్థితి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. ఇక పార్టీ కార్యక్రమాలను కూడా పూర్తిస్థాయిలో విజయవంతం చేయలేకపోతున్నారట.కనీసం పార్టీ సమావేశాలు పెడితే వచ్చేందుకు కూడా ప్రజాప్రతినిధులు ఇష్టపడటం లేదట. తాజాగా జేపీనడ్డా రాష్ట్ర నేతలతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తే కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు కావాలనే గైర్హాజరయ్యారని పార్టీలో టాక్ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేఎల్పీలో ప్రజాప్రతినిధులు సమావేశం అయ్యారు. ఆ భేటీలో రైతు రుణమాఫీపై దీక్ష చేయాలని డిసైడ్ చేశారు. అందరూ ఓకే అన్నప్పటికీ ఆ కార్యక్రమం నాలుగు సార్లు వాయిదా పడిందట. చివరకు దీక్ష చేసినా ప్రజాప్రతినిధులందరూ హాజరు కాలేదు. సీనియర్లు, కీలక నేతలు కూడా ఈ దీక్షకు మొహం చాటేయడంతో పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది.ఇక పార్టీ నేతలకు, ప్రజాప్రతినిధుల మధ్య కూడా గ్యాప్ పెరిగిందన్న చర్చ కూడా ఉంది. పార్టీ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని తమ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట ప్రజాప్రతినిధులు. పార్టీ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని.. తాము అందుబాటులో ఉన్నా పిలవడం లేదన్న బాధలో ఉన్నారట. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చినా పార్టీలో మాత్రం గెలవలేకపోతున్నామన్న భావనలో ఉన్నారని చర్చ జరుగుతోంది.ప్రజాక్షేత్రంలో గెలవలేని నేతలు పార్టీ పదవుల పేరుతో తమపై పెత్తనం చేయడం ఏంటంటూ అసంతృప్తితో ఉన్నారట ప్రజాప్రతినిధులు. ఇక కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై పార్టీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు నేతలు పార్టీ బలోపేతం కోసం పనిచేయకుండా వ్యక్తిగత ఇగోలకు పోయి పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టడంపై జాతీయ నాయకత్వం ఆరా తీసినట్టు తెలుస్తోంది.నేతలంతా ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకునేందుకు ఢిల్లీ బాట పడుతున్నారని పార్టీ ఆఫీస్‌లో చర్చ నడుస్తోంది. దీంతో జాతీయ నాయకత్వం వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల బిజీలో ఉన్న జాతీయ నాయకత్వం.. త్వరలోనే రాష్ట్ర నేతలను సెట్ చేసేందుకు రంగంలోకి దిగబోతుందని అంటున్నారు కొంతమంది నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *