దీర్ఘకాలిక సమస్యలపై టీటీడీ బోర్డు దృష్టి

సిరా న్యూస్,తిరుమల;
తిరుమల.. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన పుణ్యక్షేత్రం. అత్యంత పవిత్రమైన ఆలయం. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు వచ్చే ఆధ్యాత్మిక ప్రదేశం. అందుకే.. తిరుమలని ఆధ్యాత్మిక రాజధాని అని కూడా పిలుస్తారు. ఇదంతా.. తిరుమలకు ఉన్న ప్రాశస్త్యం. అలాంటి.. తిరుమల కొండపై గత ఐదేళ్లలో జరగరానివన్నీ జరిగాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలెన్నో తీసుకున్నారని.. భక్తుల నుంచి అనేక విమర్శలు, అసహనం వ్యక్తమయ్యాయి. మొత్తంగా తిరుమలలో వ్యవస్థ అంతా దెబ్బతిందనే అభిప్రాయాలు వచ్చాయ్. వీటన్నింటికి మించి.. తిరుమల ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. దేశం మొత్తం.. దీనిపై చర్చ జరిగింది. మళ్లీ.. అలాంటి వివాదాలకు తావు లేకుండా చూసుకోవడమే కాదు.. తిరుమల పవిత్రతను కాపాడేలా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేదే ఇప్పుడు ప్రధానమైన డిమాండ్. ముఖ్యంగా.. టీటీడీలో పనిచేసే అన్యమతస్తుల్ని తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయ్.ఎంతోమంది ఆశావహులు, మరెంతో మంది ప్రముఖులు.. టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవికి పోటీ పడ్డా.. పాలకమండలి ఛైర్మన్ హోదాలో స్వామివారికి సేవ చేసే భాగ్యం బీఆర్ నాయుడికే దక్కింది. ఆయన కూడా.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, ప్రక్షాళన చేసేందుకు.. పక్కా ప్రణాళికతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. తన ఎజెండా తనకుందని.. తిరుమల పవిత్రతని కాపాడేందుకు ఏం చేయాలో తనకు తెలుసని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అనేది.. కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన అంశం. సీఎం చంద్రబాబుకు కూడా ఇది టాప్ ప్రయారిటీ. టీటీడీలో పాలన అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే ఆయన ఆలోచన. దానికోసమే.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తిరుమలలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇప్పుడు.. కొత్తగా ఎన్నికైన పాలకమండలికి ఏ రకమైన సవాళ్లు ఎదురవబోతున్నాయన్నదే ప్రధానమైన చర్చ.గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయ్. ఐదేళ్లుగా తిరుమలకే వెళ్లలేకపోయానని.. టీటీడీ బోర్డు నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు చెబుతున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల పవిత్రతను కాపాడటమే తన లక్ష్యమని చెబుతున్నారు. అంతేకాదు.. భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం కల్పించడంతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే.. టీటీడీ బోర్డు ప్రధాన లక్ష్యం కాబోతోంది. అయితే.. కొత్త పాలక మండలికి.. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులే తొలి ప్రాధాన్యంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం రోజుకు 70 వేల మంది వరకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్యను.. రోజుకు లక్ష మందికి దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో పనిచేసిన కొందరు ఐఏఎస్ అధికారులు కూడా లక్ష మంది భక్తులకు.. స్వామి దర్శనానికి కల్పించే పద్ధతులపై అధ్యయనం చేయాల్సి ఉంది.ముఖ్యంగా.. కిలోమీటర్ల కొద్దీ భక్తులు బారులు తీరడం, షెడ్లలోనూ, బయట వేచి ఉండే పరిస్థితి లేకుండా.. వీలైనంత వేగంగా దర్శనం కల్పించేందుకు అవసరమైన వసతుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. భక్తులకు గంటలోపే దర్శనం జరిగేలా ఎలాంటి విధానం అమలు చేయాలన్న దానిపై దృష్టి పెట్టాలంటున్నారు. టైం స్లాట్ పద్ధతిని తీసుకురావడంతో పాటు త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. 300 రూపాయల దర్శనం టికెట్లను.. ఆఫ్ లైన్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే.. వీఐపీ దర్శనాలు, ప్రజాప్రతినిధుల సిఫారసు లెటర్లను అనుమతించాలనే చర్చ కూడా జరుగుతోందిగత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మారిన శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంపైనా కొత్త పాలక మండలి దృష్టి సారించాల్సి ఉందని చెబుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఇష్టరాజ్యంగా ఖర్చు పెట్టడం, తద్వారా ఎవరికి మేలు జరిగిందన్న విషయాన్ని కూడా కొత్త బోర్డు తేల్చాల్సి ఉంది. టీటీడీ బడ్జెట్‌లో దాదాపు మొత్తం సొమ్ము ఇంజనీరింగ్ పనులకు కేటాయించడంపైనా విచారణ చేపట్టాలంటున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు, అందులో దాగి ఉన్న అక్రమాలను బయట పెట్టడంతో పాటు తిరిగి అలాంటి నిర్ణయాలకు తావు లేకుండా చేయడమే కొత్త పాలకమండలి ముందున్న ప్రధానమైన లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *