చిన్నారులపై దాడులు ఆగేదెన్నడు…

సిరా న్యూస్,కాకినాడ;
ఏపీలో మహిళలపై రోజురోజుకు అకృత్యాలు పెరిగిపోతున్నాయి. అడ్డూ, అదుపు లేకుండా ప్రతిరోజు ఎక్కడో ఓ చోట అత్యాచారాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో చ‌ట్టాలు తీసుకొచ్చినా.. వారిపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. స్త్రీలు ఒంట‌రిగా క‌నిపిస్తే చాలు లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటం ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.మొన్న చిత్తూరు జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం ఘటన మరవక ముందే నెల్లూరులో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరో తరగతి బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి ఘటన సంచలనంగా మారింది. చాక్లెట్లు, తినుబండారాలు కొనిస్తూ, రీల్స్ చేపిస్తానని బాలికకు దగ్గరై.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. బాలిక తల్లి ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ ఆలీపై ఫోక్సో కేసు నమోదు చేశారు నవాబుపేట పోలీసులు.ఏపీలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రభుత్వానికి, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎప్పుడు ఏ నిమిషం ఎలాంటి వార్త వినాల్సివస్తుందోనన్న భయం మొదలైంది. ఇంటి ముందు ఆడుకునే చిన్నారుల నుంచి పండు ముసలివాళ్ల వరకు ఆగడాలు ఆగడం లేదు. ఇలాగే గత నెల కామాంధుల చేతిలో ఓ మహిళ బలైంది. బతుకుదెరువుకోసం పొట్ట చేతపట్టుకుని వచ్చిన అమాయకురాలిని దుర్మార్గులు దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. ఈ ఘటనతో కూలీకి వెళ్లే మహిళలలు పనికి వెళ్లాలంటే వణుకు పుట్టించేలా చేసింది.ఇక స్కూల్ కు వెళ్లాల్సిన పిల్లల విషయంలో కూడా అభద్రత భావం ఏర్పడింది. ఏ వైపు నుంచి ఏ రాక్షసుడు వచ్చి కాటేస్తాడో అన్న టెన్షన్ మొదలైంది. మరోవైపు ఈ అత్యాచారాల ఘటనలు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి. వరుస ఘటనలతో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలపై జరిగిన అఘాయిత్యాలు లెక్కలతో సహా వైసీపీ బయటపెట్టింది.శాంతిభద్రతలను గాలికి వదిలేశారని.. రాష్ట్రంలో వరుసగా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే కనీసం వారి గోడు వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు వారి మాటలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది అధికారపక్షం. గత పాలనలతో ఇంతకన్న ఎక్కువగానే ఘటనలు జరిగాయని చిట్టా విప్పుతోంది. పొలిటికల్ వాదనలు పక్కకు పెట్టి.. మాకు న్యాయం చేయండి మాహాప్రభో అని మొత్తుకుంటున్నారు బాధితులు, వారి కుటుంబాలు.ఇలా వరుస అత్యాచారం లాంటి భయంకరమైన, దారుణమైన ఘటనలు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు, రోడ్లపై.. పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలి కోరుతున్నారు మహిళలు. గస్తీ పెంచడంతో పాటు నేరస్థులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా కొంతమేర మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. అంతే కాకుండా మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడేవారికి.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *