ఆగని ధాన్యం కొనుగోళ్ల రచ్చ

సిరా న్యూస్,నిజామాబాద్;
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల రచ్చ నడుస్తోంది. కొంటున్నామని ప్రభుత్వం.. రైతులు ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని ప్రతిపక్షం మాటకు మాటతో డైలాగ్‌వార్‌కు దిగుతున్నాయి. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే సగానికిపైగా వడ్లు ప్రైవేటుకు అమ్ముకున్నారు రైతులు. సెంట‌ర్లు ఏర్పాటు చేశారే కానీ ఎక్కడా స‌రిగ్గా కొనుగోళ్లు జ‌ర‌గ‌డం లేదు. దీనికి ప్రధాన కార‌ణం మిల్లర్లు ధాన్యం తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డం లేదట. మిల్లర్లు చేతులెత్తేయ‌డానికి ప్రభుత్వ పాల‌సీనే ప్రధాన కారణమంటున్నారు.ఈసారి ధాన్యం తీసుకోవ‌డానికి మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీ స్కీమ్‌ పెట్టింది ప్రభుత్వం. మిల్లర్లు 5 నుంచి 20 శాతం వ‌ర‌కు బ్యాంకు గ్యారెంటీని ఇవ్వాల‌ని చెప్పింది. ఏదో విధంగా బ్యాంకు గ్యారెంటీ ఇద్దామ‌నుకున్నా..మ‌రో కండిష‌న్‌కు మాత్రం మిల్లర్లు ఒప్పుకోవడం లేదు. స‌న్నధాన్యం కూడా కేంద్రం రూపొందించినట్లు CMR అంటే క‌స్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిందేన‌ని రూల్ పెట్టింది. క్వింటాల్ ధాన్యానికి CMR కింద 67 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్ దొడ్డు వ‌డ్లకు కుదురుతుంది కానీ.. స‌న్న వడ్లకు వర్కౌట్ కాద‌ని మిల్లర్లు చేతులెత్తేస్తున్నారు. తెలంగాణ స‌ర్కారు చెప్పిన‌ట్లు స‌న్న వ‌డ్లు తీసుకుంటే.. క్వింటాల్‌కు 58 నుంచి 60 కేజీల బియ్యం మాత్రమే ఇస్తామంటున్నారు మిల్లర్లు.సీఎంఆర్ విష‌యంలో ప్రభుత్వం స‌సేమిరా అంటోంది. మిల్లర్లు మాత్రం సీఎంఆర్ ఇవ్వాలంటే క్వింటాల్‌కు 300 రూపాయ‌ల బోన‌స్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేక‌పోతే రైస్ మిల్లింగ్ వ్యవ‌స్థ కుప్పకూలుతుంద‌ని వాపోతున్నారు. ఈ విష‌యం కొలిక్కి రాక‌.. ధాన్యం కొనుగోళ్లు ప‌రిస్థితి గందరగోళంగా మారింది. దీనంతటికి సివిల్ స‌ప్లై క‌మిష‌న‌ర్ డీఎస్ చౌహానే కార‌ణ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రతీ ఏటా విడుద‌ల చేసే విధివిధానాలను కూడా ఈసారి చాలా ఆల‌స్యంగా రిలీజ్‌ చేశారు.ప్రతీ ఏడాది సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ మొద‌టి వారంలోనే గైడ్‌లైన్స్‌ ప్రకటిస్తారు. కానీ ఈసారి అక్టోబ‌ర్ 28న విధివిధానాల‌ను విడుద‌ల చేశారు. దీనికి తోడు ఈసారి ప్రక‌టించిన కండీష‌న్స్‌తో మిల్లర్లు ధాన్యం తీసుకోవ‌డానికి స‌సేమిరా అంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు స‌న్న ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోవ‌డానికి క‌మిష‌న‌ర్ విడుద‌ల చేసిన కండీష‌న్సే ప్రధాన కారణమమనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్రభుత్వం కూడా పూర్తిగా క‌మిష‌న‌ర్ డీఎస్ చౌహాన్ మీద‌నే డిపెండ్ అవుతోంద‌ని..అందుకే గ్రౌండ్ రియాలిటీని అంచ‌నా వేయ‌లేకపోతోందన్న టాక్ వినిపిస్తోంది.ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ప‌రిస్థితి చేయి దాటిపోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాకు స్పెష‌ల్ ఆఫీస‌ర్లను నియ‌మించారు. కానీ ఇప్పటి వ‌ర‌కు మిల్లర్లు ప్రస్తావిస్తున్న స‌న్న ధాన్యం మిల్లింగ్ విష‌యంలో స్పష్టత రావ‌డం లేదు. దాంతో కొనుగోళ్ల ప్రక్రియ న‌త్తన‌డ‌క‌న సాగుతోంది. ఇప్పటి వ‌ర‌కు కేవ‌లం 40వేల ట‌న్నుల‌కు మించి ధాన్యం సేక‌రించ‌లేదు. ప్రభుత్వం మాత్రం ఈసారి 90 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌రిస్తామ‌ని చెబుతోంది. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. 40 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కూడా సేక‌రించే ప‌రిస్థితి ఉండ‌దు. దీంతో ప్రభుత్వం చెప్పినట్లుగా రేష‌న్ కార్డుల మీద స‌న్న బియ్యం స‌ప్లై కూడా క‌ష్టమే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *