నిర్లక్ష్యం నీడలో అధికారుల పనితీరు

– జిల్లా పాలానాధికారి ఆకస్మిక తనిఖీలు…
ప్రత్యేక సమీక్షలు సమావేశాలతో 24/7 కష్టపడుతున్నా

– అన్ని శాఖల్లో ఇంకా వీడని బద్ధకం…నిర్లక్ష్యం

– మంత్రి ఇలాకాలో కూడా అధికారుల తీరు మారదాయే
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీహర్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి 24/7 విధులు నిర్వర్తిస్తూనే వున్నారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తూ, సమీక్షలు, సమావేశాలు, ఆకస్మిక తనిఖీలతో జిల్లాను జల్లెడ పడుతున్నారు. మండలం స్థాయి అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే… విధుల్లో బాధ్యతలు లేని వారికి మెమోలు, సరెండర్లు, సస్పెండ్ లు చేస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి సైతం లెక్క చేయకుండా ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ తన ఉద్యోగానికి న్యాయం చేస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో మాత్రం వారి విధులు నిర్వహించడంలో చిత్తశుద్ధి కానరావడం లేదు కదా తోటి అధికారిని చూసి మారుదామనే ఆలోచన లేదు. సమయానికి జీతం డబ్బులు వస్తే సరిపోతుంది అనుకునే అధికారులు వున్నంతవరకు ఈ వ్యవస్థలో మార్పు రాదనే చెప్పాలేమో. ఈ నిర్లక్ష్యం ఖరీదు విద్యార్థుల ప్రాణం మీద కు వచ్చిన సంఘటన పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలం లోని కేజీబీవి హాస్టల్ లో జరిగింది. పర్యావరణ సంబంధిత సమస్యలా లేక ఆహరం కల్తీ తెలియని సందిగ్ధం. మొత్తానికి విద్యార్థులు కోలుకోవడం ఆనందమే అయినా జరిగిన పరిణామానికి ఎవరు బాధ్యత వహిస్తారు. మళ్ళీ తల్లితండ్రులు పాఠశాలకు పంపాలంటే ఎన్నో భయాలు. హాస్టల్ పక్కనే ఉన్న డంపు యార్డు మూలంగా సమస్య వచ్చిందా మరే ఇతర కారణం ఏదైనా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక జిల్లా కేంద్రం మొదలు కొని మండలం, గ్రామ స్థాయి అధికారుల్లో విధుల నిర్వహణలో అశ్రద్ధ, బాధ్యత లేని తనం కనిపిస్తూనే ఉంటున్నాయి. వైద్య, విద్య, రెవెన్యూతోపాటు ప్రతి శాఖలో అవినీతి ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు సమయ పాలన లోపం. అధికారులు కార్యాలయాలకు ఎప్పుడు వస్తున్నారో… ఎప్పుడు వెళుతున్నారో తెలియని వైనం. అందులో పని చేసే అధికారికి క్రింద స్థాయి అధికారుల విషయమే పట్టింపు లేదు. తూతు మంత్రంగా డ్యూటీలు… మళ్ళీ బయట దందాలు… ఈ వ్యవహారం ముఖ్యంగా వైద్య, విద్యా శాఖలో ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రి నడప రాదనే నిబంధనలను వారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బయట ప్రైవేట్ ఆసుపత్రి పెట్టి మరో డాక్టర్ తో మ్యానేజ్ చేస్తున్నారు. ఇక్కడి రోగులు అక్కడికి తరలించుకు పోవడంలో తెలివిని ఉపయోగిస్తూ తప్పించుకుంటున్నారు. ఇక విద్యా వ్యవస్థలో అధికారులు, ఉపాధ్యాయులు చాలా మంది రియల్, చైన్ మార్కెటింగ్ దందాలు విధుల సమయంలోనే చక్క బెడుతున్నారు. జిల్లాలోని పలు శాఖల్లో అధికారుల విదుల కోసం ప్రభుత్వం వారికి అద్దె ప్రతిపాదికన వాహనాలు కేటాయించారు. కానీ వారు వారి స్వంత వాహనాలు పెట్టుకోని దొంగ బిల్లు పెట్టి మోసాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారు అసోసియేషన్ తరుపున ఓ జిల్లా అధికారిని సంప్రదిస్తే స్పందించక పోగా, వారిపై దురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఇంకా రెవెన్యూ, రవాణా శాఖ, సబ్ రిజిస్టర్, అబ్కారీ శాఖల్లో అయితే పట్ట పగ్గాల్లేని అవినీతి జరుగుతుందనడంలో అతిశయోక్తి లేదేమో. కిరాణా షాపుల్లోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా, నిత్యం అటు గుండా వెల్లే అధికారులు చూసి చూడనట్లు ఉండే వైనం. రౌతు సక్రమంగా ఉన్నా, పని చేయని దొంగ గుర్రాలతో పని చేయించడం కష్టమేననే భావన పలువురిలో వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి అధికారులు ఉంటే ఇక మండలం, గ్రామ స్థాయిల్లో చెప్పనలవి కానీ బాధలు. ఇటీవల మత్స్య శాఖలో కూడా చేప పిల్లల పంపిణి వ్యవహారంలో పలు అవినీతి ఆరోపణలు బలంగా వినిపించాయి. నిజాయితీగా పని చేసే అధికారులు లేకుండా పోతున్నారనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కాగా ఇటీవల విధుల నిర్వహణలో అశ్రద్ధ చూపుతున్న పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్
ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పోలీస్ శాఖలో అయితే ఆపరేషన్ గరుడ పేరుతో ఎన్ని విజయాలు సాధించారో వారికే తెలియాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఎక్కువ శాతం పోలీస్ వ్యవస్థ సీసీ కెమెరాల జపంతోనే కాలం గడిచి పోతున్నది. జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల మండల కేంద్రాలు పదుల సంఖ్యలో పోలీస్ ఠాణాలు ఉన్నా దొంగలను పట్టుకునే స్థాయిలో లేకపోవడం శోచనీయని పలువురు బహిరంగానే పేర్కొంటున్నారు. గడిచిన ఎనిమిది నెలల కాలంలో జిల్లా కేంద్రంలో పలు దొంగతనాలు జరిగినా వాటి చేదనలో ఇంకా మీనమెషాలే నడుస్తున్నాయి. సివిల్ కేసుల్లో ఉత్సాహం చూపే పోలీసులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తేలిపోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అవుతున్నది.
రాష్ట్ర మంత్రి కేంద్రంగా ఉన్న జిల్లాలో కూడా నిర్లక్ష్యమేనా …
రాష్ట్ర మంత్రిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కేంద్రంలోని మంథని నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినా అధికారులకు భయం, భక్తి లేకుండా పోతున్నది. విధులు నిర్వహణలో అదే నిర్లక్ష్యం. సమయ పాలన లేదు. స్థానికంగాఉండరు. ఇలాంటి వారికి కొంతమంది ఉన్నతాధికారులు వంత పాడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా అధికారులు మారితే గాని వ్యవస్థలో మార్పు రాదనే భావన ప్రజలల్లో బలంగా నాటుకు పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *