ఆందోళన చేపట్టిన శాంతినగర్ ప్రజలు
గ్రామస్తుల ఆందోళనతో షాపు మూయించిన పోలీసులు
సిరా న్యూస్,నెల్లూరు;
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయరహదారికి ఆనుకొని వున్న శాంతినగర్ సమీపంలో బ్రాందీ షాపు వద్దని మహిళలు నిరసన చేపట్టారు. తమ నివాసాల వద్ద బ్రాందీ షాపు తో అనేక సమస్యలు,గొడవలు వస్తున్నాయని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడే చేరుకొని స్థానికులతో, షాపు యజమానులతో మాట్లాడి షాపును మూయించి వేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా తాగుబోతుల ద్వారా నరకాన్ని అనుభవించామని వాపోయారు. తమ ఇళ్ల పక్కనే మద్యం సేవిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ ఇళ్లలో దొంగతనాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు మళ్లీ 5 సంవత్సరాలు ఇక్కడే బ్రాందీ షాపు ఏర్పాటు చేసి తమను మరింత ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తాగుబోతులు అటుగా వెళ్లే మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు.ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దృష్టికి తమ సమస్య ను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే స్పందించి అక్కడ షాపు పెట్టవద్దు అని చెప్పినా ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతరు చేస్తూ మద్యం షాప్ ఓపెన్ చేశారని ఇకనైనా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరారు.