పెళ్లిళ్లే… పెళ్లిళ్లు…

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు…తమ పిల్లల పెళ్లి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్లు, పురోహితులకు, మంగళ వాయిద్యాలు, ఫుడ్ క్యాటరింగ్, డెకరేషన్‌, ఫొటోగ్రాఫర్లకు, షామియానా , పూలదండలు, పండ్లు… తదితర వ్యాపారులకు ఈ కొన్ని రోజులు చేతి నిండా పని దొరకనుంది.నవంబర్ నెలలోని 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29 తేదీల్లో, డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తాలు దాటితో సంక్రాంతి మూఢాలు వస్తాయి. మళ్లీ శుభకార్యాలకు ఫిబ్రవరి, మార్చి నెల వరకు ఆగాల్సి ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలలో వరుస ముహూర్తాలతో కళ్యాణ మండపాలకు డిమాండ్‌ భారీగా పెరిగింది. నెల రోజుల ముందే బుకింగ్స్ అయిపోయాయని నిర్వాహుకులు చెబుతున్నారు. హోదాకు తగిన విధంగా ఉండేలా ఎక్కువ మంది ఏసీ ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసుకుంటున్నారు.కళ్యాణ మండపాల నిర్వాహుకులు…కంబైన్డ్ ప్యాకేజీలు ఇస్తున్నారు. కేటరింగ్, మండపం డెకరేషన్, పురోహితులు, బ్యాండ్ ఇలా అన్ని కలిపి ఒక ప్యాకేజీ రూపంలో చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి కళ్యాణ మండపాలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అలాగే దీపావళి, పెళ్లిళ్ల ముహూర్తాలు ఉండడంతో బంగారం, వస్త్ర దుకాణాలు రద్దీ ఉంటున్నాయి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్లు బంగారం కోసం స్థానిక జ్యువెలర్స్ షాపులకు వెళ్తున్నారు. సంపన్నులు మాత్రం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లంటే ఎంతో మందికి ఉపాధి. పురోహితులు, మంగళ వాయిద్యాలు, రజకులు, విద్యుత్, మండపాల అలంకరణ, మైక్‌ సెట్లు, లైటింగ్, భోజనాల తయారీ, షామియానా, బంగారం, వెండి ఆభరణాల తయారీ, వస్త్ర దుకాణాలు, నిత్యావసరాలు, విస్తరాకులు…ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది పెళ్లిళ్లపై ఉపాధి పెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *