సిరా న్యూస్,ఖమ్మం;
నే శివయ్యను.. నా మాట వినండి.. లేకుంటే అంతా నష్టమే జరుగుతుందంటూ.. కమలాపురంలో బాలుడు పూనకంతో చెప్పిన మాటలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తెలియగా, వారందరూ కమలాపురంకు చేరుకుంటున్నారు. అలాగే ఓ వైపు బాలుడు చెప్పినట్లుగా గ్రామస్తులు 6 అడుగుల గుంతను తీసే పనిలో నిమగ్నమయ్యారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కమలాపురం గ్రామంలో అశోక్ అనే బాలుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా పూనకంతో ఊగిపోయాడు. ఎప్పుడూ లేనివిధంగా అశోక్ పూనకంతో ఊగుతుండగా, కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు అసలు విషయం చెప్పేశారు. ఇంతకు అసలు ఆ బాలుడు ఏమి చెబుతాడోనంటూ అందరూ గుమికూడారు.అశోక్ తన వాక్కు చెప్పడం ప్రారంభించాడు. ఆ వాక్కులో తాను పరమ శివుడినని, తాను చెప్పిన ప్రదేశంలో ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని చెప్పారు. అసలే కార్తీక మాసం.. పరమ శివయ్యకు ప్రీతికరమైన మాసమిది. అటువంటి మాసంలో బాలుడు పూనకంతో ఊగిపోతూ.. ఆరడుగుల గొయ్యి తవ్వాలని కోరడంతో గ్రామస్తులు చర్చలు సాగిస్తున్నారు. ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో, భారీగా బాలుడి వాక్కు వినేందుకు కమలాపురం చేరుకుంటున్నారు.కమలాపురం గ్రామం సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అక్కడ గత మూడేళ్లుగా స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. దీనితో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి, ఇది అటవీ శాఖ పరిధిలోకి వస్తుందని, ఖాళీ చేయాలని గ్రామస్థులను కోరుతున్నారు. ఇలాంటి సమయంలోనే గత 5 నెలలుగా అదే గ్రామానికి చెందిన బాలుడు అశోక్ పూనకంతో ఊగుతున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. రోజూ ఏదో వాక్కు చెబుతుండగా, గ్రామస్తులు భయపడి చివరకు ఓ పూజారిని సంప్రదించారట.అటువంటి సంధర్భంలోనే బాలుడు అశోక్ మంగళవారం పూనకంతో ఊగుతూ, తాను చెప్పిన ప్రదేశంలో ఆరడుగుల గొయ్యి త్రవ్వాలని, అక్కడ నందీశ్వరుడు, పరమశివయ్య విగ్రహాలు బయల్పడతాయని వాక్కు చెప్పాడు. ఇక అంతే గ్రామస్తులు రంగంలోకి దిగి నిన్న కొంత త్రవ్వకం సాగించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకొని, ఆ ప్రదేశంలో శివలింగం బయటపడితే గుడి కట్టుకోవచ్చని, రిజర్వ్ ఫారెస్ట్ లో నివాసాలను మాత్రం తొలగించాలని కోరుతున్నారు. ఇది నిన్నటి మాట కాగా, నేడు అధికారుల మాట మారిందని గ్రామస్థులు తెలుపుతున్నారు.స్థానికులు మాత్రం ఇక్కడ ఉపవాసాలు ఉంటూ త్రవ్వకాలు కొనసాగిస్తున్నామని, తాము ఉండే పరిసరాల్లో దేవుడు బయటపడడం తమకు దక్కిన భాగ్యం అంటున్నారు గ్రామస్తులు. కానీ అశోక్ అనే బాలుడు మాత్రం, ఇప్పటికీ పూనకంతో ఊగుతూ అదే ప్రదేశంలో ఉండడం విశేషం. ఓ వైపు ఫారెస్ట్ అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ద్వారా అనుమతి తెచ్చుకొని, త్రవ్వకాలు సాగించాలని మరో వైపు కోరుతున్నారు. మరోవైపు గ్రామస్తులు గుంటను త్రవ్వలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ ఉంది. గ్రామస్తులు మాత్రం ప్రొక్లెయిన్ ద్వారా బాలుడు చెప్పిన ప్రదేశంలో త్రవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. మరి చూడాలి అసలు బాలుడి వాక్కు వాస్తవం అవుతుందా.. అలాగే అధికారులు అనుమతులు ఇచ్చి త్రవ్విస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.