సిరా న్యూస్,పటాన్ చెరు;
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని వాలంటీస్ లాబొరేటరీస్ ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీ ఎదుట భర్త మృతదేహంతో భార్య ఆందోళన చేపడుతోంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం అప్పటి శ్రీ చైతన్య క్లోరైడ్ లాబొరేటరీస్ ప్రైవెట్ లిమిటెడ్ కంపెనీకి చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ ప్రజాపతి 2015 నుంచి 2019 వరకు లేబర్ సప్లయ్ చేస్తూ లేబర్ కాంట్రాక్టర్ గా జీవనం సాగిస్తున్నాడు. కరోనా సమయంలో లేబర్ లేకపోవడంతో కాంట్రాక్ట్ మానేశాడు. అప్పటి వరకు సంజయ్ కు రావాల్సిన రూ. 9 లక్షలు పరిశ్రమ యాజమాన్యాన్ని ఎన్ని సార్లు అడిగినా ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ కంపెనీకి వాలంటీస్ లాబొరేటరీస్ ప్రైవెట్ లిమిటెడ్ గా పేరు మార్చి కొనసాగిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ సంజయ్ ప్రజాపతి మృతి చెందడంతో భర్త మృతదేహంతో తన నలుగురు పిల్లలతో కలిసి భార్య దుర్గా ప్రజాపతి ధర్నాకు కూర్చుంది. పాత బకాయిలు చెల్లించాలని అడిగితే మాకేం సంబంధం లేదంటూ పరిశ్రమ యాజమాన్యం చెబుతుండడంతో మాకు దిక్కెవరని, నలుగురు పిల్లలతో రోడ్డున పడ్డామంటూ న్యాయం చేయాలని రోధిస్తూ పరిశ్రమ ఎదుటే కూర్చుంది. విషయం తెలుసుకున్న బీడీఎల్ బానూర్ పోలీసులు విచారణ చేపట్టారు.