నగరంలో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు

సిరా న్యూస్,విజయవాడ;
ఫొటో గ్రాఫర్లలో ఫొటో జర్నలిస్టులు వేరయా…అన్నట్లు నగరంలో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం బందరురోడ్డులోని బాలోత్సవ భవన్‌లో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ఇండియా ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రాఫిక్‌ కౌన్సిల్‌ ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎపి న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు మాట్లాడుతూ ఫొటోగ్రాఫర్స్‌ కార్యక్రమానికి రావడం ఇది రెండవసారి అని అన్నారు. ప్రకృతి మనిషిని ఇబ్బంది పెడితే ఎలా వుంటుందో మొన్న వచ్చిన వరదలే నిదర్శనం అటువంటి వరదలలోని ఫొటోలు చూస్తుంటే గతంలో మేము మా కుటుంబంతో వరదలలో బాధితునిగా వున్న సంఘటన గుర్తు వస్తుందన్నారు. పండుగులు, తిరునాళ్ళు, ఉత్సవాలు ఫొటోలు వలన సుమారు 30 సంవత్సరాల క్రితం జరిగిన స్మృతులను నెమరువేసుకున్నారు. విజయవాడకు ఒక ప్రత్యేకత వుంది అటువంటి ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే రెండవ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు పాల్గొనడం ఆనందంగా వుందన్నారు. నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి తన వృత్తిలోనే ఎగ్జిబిషన్‌ నిర్వహించిన అవార్డుల ద్వారా సత్కరించి ఫొటో గ్రాఫర్లకు మనోధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించే విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టెక్నాలజీపరంగా ముందుకు వెళ్ళిందనడానికి నిదర్శనం జరిగిన డ్రోన్‌ ప్రదర్శన అని అన్నారు. సేవలో వుండే ప్రాధాన్యత వేరని, సేవ అనేది ఈ సమాజానికి అవసరం వుందన్నారు. దైనందికంగా సేవా కార్యక్రమాలే కాకుండా పెద్దవాళ్ళ సంరక్షణకి ఎంతవరకు చేయగలమో అది సమాజ సేవా కార్యక్రమమని ఇక్కడ వరదల సందర్భంగా ఏర్పాటుచేసిన కొన్ని ఛాయాచిత్రాలు నిదర్శనమని కొనియాడారు. అలాంటి పెద్దవాళ్ళ సంరక్షణ అనేది విపత్కర పరిస్థితిలోనే కాకుండా సమాజంలో కూడా పెద్దవాళ్ళ పట్ల సమస్య ఏర్పడినపుడు సేవలందించి సహాయ పడాలని సూచించారు. ఎవరి వృత్తిలో వారు నైపుణ్యం సాధించి విజయం దిశగా ప్రయాణించి తమ గమ్యాన్ని సాధించాలన్నారు.
శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ దేశానికి చేస్తున్న సేవ ఇక్కడ ఏర్పాటుచేసిన ఛాయాచిత్రాలు ద్వారా అర్థమవుతుంది. భవిష్యత్తులో విపత్తులకు ఈ ఛాయాచిత్రాలు ఒక శాసనాలు అని అన్నారు. గతంలో ఉప్పెనలో కూడా ఫొటోలు ద్వారా తమవంతు బాధ్యత నిర్వహించి వెలుగెత్తి అద్బుతంగా చిత్రీకరించి జాతికి అందించారన్నారు. ఛాయా చిత్రాలకు జాతి రుణపడి వుందన్నారు. జడ్జిమెంట్‌లో కొన్ని సందర్భాలలో ఛాయిచిత్రాలు ఆధారమవుతాయన్నారు. కళను కళగా ఆరాధించాలన్నారు. విపత్తులు, ఉత్సవాలు, డ్రోన్‌ సమ్మిట్‌, పండుగలు ఫొటో తీసిన వారికి శుభాకాంక్షలు తెలిపార. కేంద్ర ప్రభుత్వం ఫొటోగ్రఫీకి సముచిత స్థానం కల్పించాలన్నారు. నిర్వాహకులు టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రపంచ ఫొటోజర్నలిజం దినోత్సవ వేడుకలు జర్మనీలో తరువాత ఇండియాలోని ఎపిలోని విజయవాడలో రెండవది అన్నారు. ఫొటో జర్నలిస్టులందరికీ ఇది వేదిక అని ప్రతివారికి అవార్డులు ద్వారా వారికి ప్రోత్సహిస్తున్నామన్నారు. న్యాయనిర్ణేతులుగా ది హిందూ రెసిడెంట్‌ ఎడిటర్‌ అప్పాజీ రెడ్డెం, నాగార్జునా యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ జర్నలిజం అండ్‌ మాస్‌కమ్యూనికేషన్‌ కె.జ్యోతిర్మయ్‌, సోషల్‌ హిస్టోరియన్‌, డెవలప్‌మెంట్‌ యాక్టివిస్ట్‌ ఫ్రీలాన్సర్‌ జర్నలిస్ట్‌ కొంపల్లి .హెచ్‌.ఎస్‌.ఎస్‌.సుందర్‌ వ్యవహరించారు. ఈ ఎగ్జిబిషన్‌లో 100 మంది పాల్గొనగా, 38 మంది అవార్డులు గ్రహీతలుగా నిలిచారు. మొదటి, ద్వితీయ, తృతీయ అవార్డులు, మెమోరియల్‌ అవార్డులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్‌ సభ్యులు గోకరాజు గంగరాజు, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్‌ ఇండియా ఉపాధ్యక్షులు సుందర్‌ కొపల్లి, కౌన్సర్‌ వైద్యనిపుణులు డాక్టర్‌ ఎన్‌.సుబ్బారావు, నగర ప్రముఖులు, పోలవరపు సాంస్కృతి సమితి గోళ్ళ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *